త్వరలోనే తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడి ప్రకటన: చంద్రబాబు
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర టీడీపీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు.
By Srikanth Gundamalla Published on 10 Aug 2024 8:26 PM ISTత్వరలోనే తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడి ప్రకటన: చంద్రబాబు
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర టీడీపీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో టీడీపీ బలోపేతంపై పలు సూచనలు చేశారు. అలాగే సభ్యత్వాలను పెంచాలని నాయకులకు చంద్రబాబు సూచించారు. ఏపీలో అధికారం చేపట్టిన తర్వాత.. చంద్రబాబు తెలగాణలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. త్వరలోనే తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ సమావేశంలో టీడీపీ నేతలతో మాట్లాడిన చంద్రబాబు.. నలభై ఏళ్లలో పార్టీ ఎదుర్కొన్న పరిస్థితులను గురించి చెప్పారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ బలోపేతం అంశంపైనా చర్చించారు. రాష్ట్ర నాయకులు, కార్యకర్తల నుంచి వచ్చిన వినతులను తీసుకున్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లోని క్యాడర్‌ను సమన్వయం చేసుకుంటూ నేతలు ముందుకు వెళ్లాలని చెప్పారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ నూతన కమిటీల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు.
రాబోయే 20 రోజుల్లో సభ్యత్వాల నమోదు ప్రారంభించే అవకాశం ఉందన్నారు. సభ్యత్వాల నమోదు పూర్తయ్యాకే కమిటీలు ఏర్పాటు చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై పార్టీ కార్యకర్తల నుంచి వినతులు వస్తున్నాయని చెప్పారు. అందుకే త్వరలోనే తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడిని నియమించి.. మరింత యాక్టివ్‌గా పనిచేసేందుకు చర్యలు తీసుకుంటామని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని చెప్పారు. అయితే.. తెలంగాణలో గత ఎన్నికల్లో కొన్నికారణాల వల్లటీడీపీ పోటీ చేయలేకపోయిందని చంద్రబాబు చెప్పారు.