అమెరికాలో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్

అమెరికాలో తెలంగాణ విద్యార్థి ఒకరు అదృశ్యం అయ్యాడు.

By Srikanth Gundamalla  Published on  9 May 2024 7:13 AM GMT
telangana student, rupesh, missing,  america ,

అమెరికాలో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్

విదేశాల్లో ఉన్నత చదువులు కోసం ఎంతో మంది విద్యార్థులు కలలు కంటుంటారు. దాన్ని నిజం చేసుకునేందుకు తాము కష్టపడతారు. ఇక అక్కడికి వెళ్లాక బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి లైఫ్‌లో సెటిల్‌ అవ్వాలని తాపత్రయ పడతారు. తెలంగాణకు చెందిన రూపేశ్ చంద్ర అనే యువకుడు కూడా ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. అయితే.. ఈ తెలంగాణ విద్యార్థి రూపేశ్‌ తాజాగా అదృశ్యం అయ్యాడు. ఈ విషయాన్ని షికాగోలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

ఈ నెల 2వ తేదీ నుంచి 25 సంవత్సరాలున్న రూపేశ్ చంద్ర చింతకింది ఆచూకీ తెలియడం లేదని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. రూపేశ్‌ ఆచూకీ కోసం స్థానిక పోలీసులతో పాటు ప్రవాస భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. రూపేశ్‌ షికాగోలోని ఎన్‌ షెరిడియన్‌ రోడ్డులో ఉన్న 4300 బ్లాక్‌లో నివసించేవాడనీ.. అక్కడి నుంచే రూపేశ్ కనిపించకుండా పోయినట్లు అధికారులు చెబుతున్నారు. రూపేశ్ ఆచూకీ కోసం తల్లిదండ్రులు కంగారుపడుతున్నారు.

రూపేశ్ స్వస్థలం తెలంగాణలోని హనుమకొండ. విస్కాన్సిన్‌ రాష్ట్రంలోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్‌ చదువుతున్నాడు. ఈ నెల 2న తన కుమారుడితో వాట్సాప్‌ కాల్‌లో మాట్లాడాననీ.. అప్పుడు పనిలో ఉన్నాని చెప్పాడని రూపేశ్ తండ్రి సదానందం చెప్పాడు. ఆ తర్వాత నుంచి ఫోన్‌ చేస్తే అందుబాటులోకి రావడం లేదని చెప్పారు. స్నేహితులను అడిగితే టెక్సాస్ నుంచి వచ్చేవారిని కలిసేందుకు రూపేశ్‌ వెళ్లాడని చెప్పినట్లు తండ్రి వివరించాడు. రూపేశ్‌ను కలవడానికి వచ్చిన వారు ఎవరో కూడా తెలియదని స్నేహితులు చెప్పారట. దాంతో.. రూపేశ్‌ను ఎక్కడికి తీసుకెళ్లారు? అసలు ఏమయ్యాడనే విషయాలు తెలియక కంగారు పడుతున్నట్లు తండ్రి సదానందం వెల్లడించాడు. ఈ క్రమంలోనే అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించామన్నారు.

Next Story