షాహీన్ బాగ్ అక్రమ కట్టడాల కూల్చివేత - జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు

By -  Nellutla Kavitha |  Published on  9 May 2022 11:45 AM GMT
షాహీన్ బాగ్ అక్రమ కట్టడాల కూల్చివేత - జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు

ఢిల్లీ షాహీన్‌బాగ్‌లో తిరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షహీన్‌ బాఘ్‌లోని అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు సోమవారం ఉదయం అధికారులు, పోలీసులు బుల్డోజర్లతో చేరుకున్నారు. బుల్డోజర్ డ్రైవ్ కు వ్యతిరేకంగా ఆందోళనకారులు నిరసన చేపట్టారు, వాటిని స్థానికులు అడ్డుకున్నారు. ఈ నిరసనలో ప్రజలతో పాటుగా స్థానిక నేతలు కూడా పాల్గొన్నారు. దీంతో షహీన్‌ బాఘ్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఈ నేపథ్యంలోనే షాహీన్ బాగ్ కూల్చివేతలను సవాల్‌ చేస్తూ, అధికారుల తీరు నిరసిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది సీపీఎం పార్టీ. అక్కడి కూల్చివేతలపై స్టే ఇవ్వాలని పిటిషన్‌లో విజ్ణప్తి చేశారు. అక్రమ కట్టడాల కూల్చివేతపై దాఖలైన పిటిషన్ విచారణకు తీసుకోమని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. కోర్టును ఆశ్రయించినవారిలో బాధితులు లేరని, స్థానిక బాధితులు కాకుండా రాజకీయ పార్టీ పిటిషన్ వేసిందని, రాజకీయాలకు అత్యున్నత న్యాయస్థానాన్ని వేదికగా చేసుకోవద్దని మందలించింది సుప్రీంకోర్టు. అంతే కాకుండా ఇందులో తాము జోక్యం చేసుకోమని, ఏదైనా ఉంటే ఢిల్లీ హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచించింది సుప్రీంకోర్టు. అత్యున్నత న్యాయస్థానాన్ని రాజకీయాలకు వేదిక చేయొద్దని జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ధర్మాసనం పేర్కొంది.

Next Story