శ్రీశైలం ఘాట్‌రోడ్డులో ప్రమాదం, ముగ్గురు హైదరాబాద్ యువకులు మృతి
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది.
By Srikanth Gundamalla Published on 4 Aug 2024 7:30 AM GMTశ్రీశైలం ఘాట్‌రోడ్డులో ప్రమాదం, ముగ్గురు హైదరాబాద్ యువకులు మృతి
ఎగువన భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో తెలంగాణలోని నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. దాంతో.. ప్రాజెక్టు గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేయడంతో పర్యాటకులు పెద్ద ఎత్తున శ్రీశైలానికి క్యూ కడుతున్నారు. మరోవైపు వీకెండ్ కావడంతో రద్దీ మరింత పెరిగింది. అయితే.. శ్రీశైలం ప్రాజెక్టును చూసేందుకు వెళ్లిన ముగ్గురు యువకులు అనూహ్యంగా రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి అందాలను వీక్షించేందుకు వెళ్లి ఘాట్ రోడ్డు జరిగిన ప్రమాదంలో చనిపోయారు.
హైదరాబాద్‌లోని బొల్లారానికి చెందిన నలుగురు యువకులు.. ఆదివారం సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టును చూసేందుకు బయల్దేరారు. శనివారం రాత్రి 12 గంటలకే అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని వటవర్లపల్లి వద్ద కారు అదుపు తప్పింది. దాంతో.. వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టింది కారు. ఈ సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడే మృతి చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ యువకుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుస్తున్నారు. చనిపోయిన ముగ్గురు యువకుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడ్డ వ్యక్తి దోమపెంట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిసింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.