అయోధ్య రామాలయానికి ధర్మవరం ప్రత్యేక పట్టుచీర

By -  Nellutla Kavitha |  Published on  14 April 2022 5:22 PM IST
అయోధ్య రామాలయానికి ధర్మవరం ప్రత్యేక పట్టుచీర

అయోధ్యలో నిర్మితమవుతున్న భవ్య దివ్య మందిర నిర్మాణానికి ధర్మవరం నేతన్న అపురూపమైన కానుకను అందించబోతున్నారు. పూర్తిగా రామ నామాలతో నిండిన అరుదైన పట్టుచీరను అయోధ్య రామాలయానికి అందించబోతున్నారు ధర్మవరానికి చెందిన డిజైనర్ నాగరాజు. తమ పనితనంతో ఇప్పటికే ఎన్నో అద్భుతాలను సృష్టించిన నేతన్నలు, చేనేత వైభవాన్ని మరోసారి ప్రపంచానికి చటబోతున్నారు.

ఎన్నెన్నో ప్రత్యేకతలు ఉన్న పట్టు వస్త్రాన్ని రామాలయం కోసం నాలుగు నెలలపాటు కష్టపడి రూపొందించారు డిజైనర్ నాగరాజు. శ్రీరామ నామాలతో పాటుగా, రామాయణ ఘట్టాలతో, 16 కిలోల బరువుండే ఈ చీర, 180 అడుగుల పొడవు ఉంటుంది. సప్తవర్ణాలతో తయారైన ఈ పట్టుచీరలో 13 భాషల్లో జైశ్రీరామ్ అన్న అక్షరాలను అందంగా, అద్భుతంగా కూర్చారు. దీంతో పాటుగానే 168 రకాల రామాయణ చిత్రాలు ఉండేలా పట్టుచీరను డిజైన్ చేశారు. ఈ పట్టుచీర మొత్తం లో 32,200 జైశ్రీరామ్ నామాలను పొందుపరిచారు నేతన్నలు. పూర్తిగా చేనేత మగ్గం పై రూపొందించిన ఈ పట్టుచీర తయారీకి నాలుగు నెలల పాటు శ్రమించి పని పని చేశాము అంటున్నారు డిజైనర్ నాగరాజు.

పట్టుచీరలకే ప్రత్యేకమైన ధర్మవరంలో నాగరాజు ఆధ్వర్యంలో నలుగురు నేతన్నలు నాలుగు నెలల పాటు శ్రమించి ఈ ప్రత్యేక వస్త్రాన్ని రూపొందించారు. పూర్తిగా రామ నామాల తోనే రూపొందించిన ప్రత్యేక పట్టుచీరను ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆవిష్కరించారు. త్వరలోనే ఈ పట్టు వస్త్రాన్ని అయోధ్యలోని రామ మందిరానికి బహుకరించనున్నట్లుగా తెలిపారు నాగరాజు.

Next Story