సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.
By Srikanth Gundamalla Published on 10 Oct 2023 3:15 PM ISTసుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా
స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. వచచే శుక్రవారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే.. అంతకుముందు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై వాదనలు వాడీవేడిగా కొనసాగాయి. చంద్రబాబు తరఫున హరీశ్ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదనలను వినిపించారు. వాదనలు సుదీర్ఘంగా, వాడీవేడిగా కొనసాగడంతో సుప్రీంకోర్టులో ఇరు తరఫున త్వరగా ముగించాలని న్యాయవాదులను కోరింది. మరో గంట సమయం కావాలని న్యాయవాదులు కోరడంతో.. ఇతర కేసులను కూడా విచారించాల్సి ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. భోజన విరామం తర్వాత ముకుల్ రోహత్గి వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే.. పిటిషన్‌పై వాదనలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయి.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసు విచారణ సందర్భంగా చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది హరీశ్ సాల్వే 17ఏ సెక్షన్‌కు సంబంధించిన విషయాలను ప్రస్తావించారు. రఫేల్ కొనుగోళ్లపై యశ్వంత్ సిన్హా వేసిన పిటిషన్, అనంతరం దాఖలైన పలు కేసులపై వచ్చిన తీర్పులను ఆయన కోర్టుకి చెప్పారు. రఫేల్ కేసు ఆరోపణలు 2016కు సంబంధించినవి.. కానీ సిన్హా పిటిషన్పై తీర్పులు 2019లో వచ్చాయి. చట్ట సవరణకు ముందున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని 2019లో కేసుని కొట్టేశారని న్యాయవాది హరీశ్ సాల్వే వాదించారు. అలాగే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుపై నమోదైన ఎఫ్‌ఐఆర్ చట్టబద్ధం కాదని.. దాన్ని సవాల్ చేస్తానని అన్నారు హరీశ్ సాల్వే. అన్ని కలిపేసి ఒక ఎఫ్‌ఐఆర్‌ను రూపొందించారు.. అందులో ఎక్కడా చంద్రబాబు పేరు లేదని సుప్రీంకోర్టులో హరీశ్ సాల్వే వాదించారు.
ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన రోహత్గీ... అవసరమైన డాక్యుమెంట్లను కోర్టు ముందు ఉంచామని చెప్పారు. 2018 చట్టసవరణ తర్వాత చంద్రబాబుని ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినా.. దాన్ని రాజకీయ ప్రతీకార చర్యగా చూడకూడదు అంటూ ప్రస్తావిచంఆరు. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబుపై తగిన ఆధారాలు దొరికిన తర్వాతే 2021లో కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. కేసులో చంద్రబాబుని ఎప్పుడు చేర్చినా.. విచారణ కొనసాగుతున్నట్లే పరిగణించాలని కోర్టు ముందు తెలిపారు న్యాయవాది రోహత్గీ. చట్టసవరణకు ముందున్న ఆరోపణలకు అంతకుముందున్న చట్టమే వర్తిస్తుందనీ... ఇది చట్టసవరణకు ముందున్న నేరం కాబట్టి 17ఎ వర్తించదని’ అని రోహత్గీ తన వాదనలు వినిపించారు.