నంద్యాలలో స్నేహితుడి ఓటమి.. పవన్‌కు అల్లు అర్జున్‌ శుభాకాంక్షలు

నంద్యాలలో ఐకాన్‌ స్టార్‌ ఎన్నికల ప్రచారం చివరి రోజు సందడి చేసిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  4 Jun 2024 5:46 PM IST
Shilpa ravichandra,  nandyala, allu arjun, pawan kalyan,

నంద్యాలలో స్నేహితుడి ఓటమి.. పవన్‌కు అల్లు అర్జున్‌ శుభాకాంక్షలు

నంద్యాలలో ఐకాన్‌ స్టార్‌ ఎన్నికల ప్రచారం చివరి రోజు సందడి చేసిన విషయం తెలిసిందే. తన స్నేహితుడు వైసీపీ నుంచి పోటీ చేశారు. శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డికి మద్దతుగా ఐకాన్ స్టార్ నంద్యాలకు వెళ్లారు. అయితే.. ఎన్నికల్లో స్నేహితుడికి మద్దతు తెలపడం కోసం వెళ్లిన అల్లు అర్జున్‌ ఆ తర్వాత కాస్త ఇబ్బంది కూడా పడ్డాడు. ఆయన నంద్యాలకు వెళ్లడంతో పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. ఈ క్రమంలో పలువురి ఫిర్యాదుతో అల్లు అర్జున్‌పై కేసు కూడా నమోదు అయ్యింది.

ఇక తాజాగా అల్లు అర్జున్ మద్దతు తెలిపిన నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిశోర్‌రెడ్డి ఓటమిని చూశారు. రవిచంద్రపై టీడీపీ అభ్యర్థి మహ్మద్‌ ఫరూక్‌ 11వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. నంద్యాలలో శిల్ప రవిచంద్రకు మద్దుతగా అల్లు అర్జున్ వెళ్లినా ఫలితం లేకుండా పోయిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఒక వైపు పవన్ కల్యాణ్‌ వైసీపీ వ్యతిరేకంగా పోటీ చేసి.. ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే.. అల్లు అర్జున్‌ వెళ్లి రవిచంద్రను కలవడాన్ని పలువురు జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. దీన్ని తప్పుబట్టారు. కుటుంబానికి చెందిన జనసేన పార్టీకి మద్దతు ఇవ్వరా అంటూ నిలదీశారు. కాగా.. ఆ తర్వాత అల్లు అర్జున్‌ వివరణ ఇచ్చారు. స్నేహితుడు కాబట్టే వెళ్లానని చెప్పుకొచ్చారు. ఇక తాజాగా శిల్ప రవిచంద్రకిశోర్‌ ఓటమిని చూడటం చర్చనీయాంశం అయ్యింది.

మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పిఠాపురంలో భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. సమీప వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వంగా గీతపై 70వేలకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు. దాంతో.. ఆయన తొలి సారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఇక తాజాగా పవన్ కల్యాణ్‌ గెలుపుపైనా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఎక్స్‌ వేదిక శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టు పెట్టారు. పిఠాపురంలో ఘన విజయం సాధించిన పవన్ కల్యాణ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ విజయం ద్వారా సంవత్సరాల తరబడి ప్రజలకు సేవ చేయాలనే మీ కృషి, అంకితభావం, నిబద్ధత ఎప్పుడూ హృదయాన్ని హత్తుకునేవి అంటూ రాసుకొచ్చారు. ప్రజలకు సేవ చేయాలనే పవన్ కల్యాణ్‌ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు అంటూ ఎక్స్‌ వేదికగా అల్లు అర్జున్ రాసుకొచ్చారు.


Next Story