నార్త్ కొరియా లో నాలుగు రోజుల్లోనే పది లక్షల కేసులు
By - Nellutla Kavitha | Published on 16 May 2022 7:15 PM ISTనార్త్ కొరియా లో కోవిడ్ విశ్వరూపం చూపిస్తోంది. తొలి కేసు బయటపడిన గురువారం నుంచి ఇప్పటిదాకా కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వ మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. భారీగా టెస్టులు చేసే అవకాశం లేకపోవడం, వైద్య సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉండడంతో ఎక్కువమంది ప్రజలు కరోనా బారిన పడ్డారని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ఉత్తరకొరియా లో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ పది లక్షల మందికి పైగా జ్వరంతో బాధ పడుతున్నారని అధికారిక మీడియా వెల్లడించింది.
దాదాపుగా 26 మిలియన్ల జనాభా ఉన్న ఉత్తర కొరియాలో వ్యాక్సినేషన్ లు వేయకపోవడం ప్రజల ప్రాణాల మీదకు తెచ్చింది. అక్కడ సరైన వైద్య ఆరోగ్య వ్యవస్థ లేకపోవడం కూడా వారిని భారీగా కోవిడ్ బారిన పడేలా చేసింది. నాలుగు రోజుల వ్యవధిలోనే 10 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. గురువారం రాజధాని ప్యాన్ గాంగ్ లో మొదటి కేసు నమోదు కావడంతో జాతీయస్థాయిలో లాక్ డౌన్ విధించారు. దీంతోపాటే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అత్యవసర మీటింగ్ నిర్వహించారు. దేశమంతా తీవ్రస్థాయిలో కోవిడ్ విజృంభించడంతో సైన్యాన్ని రంగంలోకి దించారు అధ్యక్షుడు కిమ్. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడిన నేపథ్యంలో, కేవలం దేశ సరిహద్దుల మూసివేతతోనే వైరస్ ను అదుపులో పెట్టుకోవచ్చని భావించాడు కిమ్.
రష్యా, చైనా, తోపాటుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పంపించిన వ్యాక్సిన్లను కూడా ప్రజలకు పంపిణీ చేయకుండా వెనక్కి తుప్పు పంపించారు. ఉత్తర కొరియాకు పొరుగునే ఉన్న దక్షిణ కొరియా సహా, వివిధ ప్రపంచ దేశాలు సహాయం అందిస్తామని చెప్పినప్పటికీ అధ్యక్షుడు కిమ్ మాత్రం ఇప్పటికీ స్పందించలేదు. కోవిడ్ నిర్ధారణకు అవసరమైన టెస్ట్ కిట్లు కూడా లేకపోవడం, టెస్టులు చేసే అవకాశం కూడా ఉత్తర కొరియాకు లేకపోవడంతో లక్షణాల ఆధారంగానే కోవిడ్ గా భావిస్తున్నారు.