భారీగా కోవిడ్ కేసులు
By - Nellutla Kavitha | Published on 16 March 2022 12:09 PM GMTచైనాలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మంగళవారం రికార్డుస్థాయిలో దేశంలో ఐదు వేలకు పైగా కేసులు నమోదైనట్లు చెప్పింది చైనా. దీంతో జిలిన్ ప్రావిన్స్లో లాక్ డౌన్ విధించింది. కరోన బయటపడ్డ అప్పటినుంచి ఇప్పటిదాకా చైనా వూహన్, హూబె తర్వాత లాక్ డౌన్ విధించడం జిలిన్ ప్రావిన్స్ లోనే. లాక్ డౌన్ విధించడంతో మల్టీ నేషనల్ కంపెనీల వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో టొయోటా, ఫోక్స్ వాగన్, ఆపిల్ ఉన్నాయి. వీటితో పాటుగా జిలిన్ ప్రజలు బయటకు వెళ్లకుండా నిషేధం విధించారు. బస్సులు, మెట్రో రైళ్లు రద్దు చేశారు. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం ఇతర నిత్యావసర వస్తు సేవలు మినహా అన్ని వ్యాపారాలు మూసేయాలని, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని సూచించారు. ఇక స్కూల్స్ ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేశారు. వైరస్ ను నియంత్రించడానికి మళ్లీ భారీ స్థాయిలో కఠిన చర్యలు తీసుకుంటోంది చైనా. జీరో కోవిడ్ వ్యూహాన్ని మళ్లీ అమలు చేసే ప్రయత్నాల్ని చైనా మొదలుపెట్టింది. కేసులు భారీగా బయటపడడంతో వేగంగా లాక్డౌన్ అమలు చేయడంతో పాటుగా, సామూహిక పరీక్షలు, ప్రయాణాలపై ఆంక్షలు, కఠిన చర్యలు అమలు చేస్తోంది.
చైనాలో సరికొత్తగా వస్తున్నా కేసులకి ప్రధాన కారణం ఒమైక్రాన్ వేరియంట్లో వచ్చినటువంటి మార్పులే. ప్రస్తుతం వచ్చిన కొత్త వేరియంట్ ని స్టెల్త్ ఒమైక్రాన్ గా పిలుస్తున్నారు. ఇది ఒమైక్రాన్ కంటే వేగంగా వ్యాపిస్తుందని భావిస్తున్నారు. చైనాలో 2021లో వెలుగుచూసిన మొత్తం కేసుల కంటే ఈ ఏడాది ప్రారంభం నుంచే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అందుకే పాత పద్ధతులను కొనసాగించి వైరస్ ను నియంత్రించడం చైనాకు ఇప్పుడు సవాల్గా మారింది. దీంతో కఠిన చర్యలు అమలు చేయడంతోపాటు, జీరో కోవిడ్ వ్యూహాన్ని మెయింటైన్ చేస్తోంది చైనా.
చైనాతోపాటుగా సౌత్ కొరియాలోనూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో నాలుగు లక్షల కేసులు నమోదయ్యాయి. అవన్నీ లోకల్లీ ట్రాన్స్ మిటెడ్ కేసులు. కరోనా బయటపడ్డప్పటినుంచి ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే మొదటిసారి. సౌత్ కొరియా తర్వాత యియత్నాంలో లక్షకు పైగా కేసులు నమోదయినట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కరోనా అంతం కాలేదని జాగ్రత్తగా ఉండాలని సూచించింది.