గుట్టపై ప్రైవేటు వాహనాలకు అనుమతి లేదు
By - Nellutla Kavitha | Published on 31 March 2022 2:40 PM GMTయాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో దర్శనాలు ప్రారంభం అయ్యాయి. ఇటీవలే పునర్నిర్మాణం అనంతరం సామాన్య భక్తులకు ప్రవేశం కల్పించడంతో క్రమంగా భక్తుల తాకిడి పెరుగుతోంది. యాదాద్రి కట్టడాన్ని, వైభవాన్ని, అద్భుతమైన ఆలయాన్ని చూసి పరవశించిపోతున్నారు భక్తులు. ఇక ఆలయంలోనిర్వహించే వివిధ సేవలు, దర్శనాల వేళలను ప్రకటించారు అధికారులు. దీంతో రద్దీ క్రమంగా పెరుగుతోంది.
మరోవైపు రేపటి నుంచి యాదాద్రి కొండపైకి ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభించనున్నారు అధికారులు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల వాహనాలు కొండ కిందే పార్క్ చేయాలని ఆలయ అధికారుల ఆదేశాలు జారీ చేశారు. సొంత వాహనాల్లో కాకుండా యాదాద్రి కొండపైకి ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లాలని ఆలయ ఈవో గీత ప్రకటన విడుదల చేశారు. కొండపైకి ప్రైవేటు వాహనాలను యాదాద్రి దేవస్థానం నిషేధించిందని, దేవస్థానం ఉచితంగా ఏర్పాటు చేసే ఆర్టీసీ బస్సుల్లోనే భక్తులను కొండపైకి తరలిస్తామని ఈవో తెలిపారు. అందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని, భక్తుల తరలింపునకు అయ్యే ఖర్చు మొత్తం దేవస్థానమే భరించనుందని ఆమె వెల్లడించారు. కొండ కింది నుండి పైకి, తిరిగి పైనుండి కిందికి భక్తులను ఫ్రీగా తరలిస్తామని, ఏప్రిల్ ఒకటి నుండి టూవీలర్ సహా భక్తుల వాహనాలన్నీ కొండపైకి నిషేధం విధిస్తామని గీత చెప్పారు. మరోవైపు ఆలయంలో స్వామివారి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, శాశ్వత కల్యాణంతో పాటుగా మరికొన్ని ప్రత్యేక సేవలను కూడా త్వరలోనే ప్రారంభించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు ఈవో గీత పేర్కొన్నారు.
మరోవైపు గుట్టకు వెళ్లే మినీ బస్సు సర్వీసులను బుధవారం ఉప్పల్ బస్టాప్‌లో TSRTC చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, MD వీసీ సజ్జనార్ ప్రారంభించారు. యాత్రికులు వివిధ ప్రాంతాల నుంచి, మినీ బస్సులతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాదాద్రికి చేరుకోవడానికి TSRTC సౌకర్యాలు కల్పిస్తోందని చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి తెలిపారు. ఇక హైదరాబాద్ నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని MD సజ్జనార్ వెల్లడించారు. డిమాండ్ బట్టి సంఖ్య పెంచడంతో పాటుగా, బాసర, భద్రాచలం, వేములవాడ, కాళేశ్వరం నుంచి గుట్టకు బస్సులను అనుసంధానం చేస్తామన్నారు. ఇక RTC బస్సుల్లో ఆధ్యాత్మిక అనుభూతిని పెంపొందించడానికి యాత్రీకుల కోసం భక్తి పాటలను వేసే సౌకర్యం కూడా ఉంచుతున్నారు.