పీఎంవో అధికార కేంద్రంలా ఉండాలనేది నా విధానం కాదు: ప్రధాని మోదీ
పదేళ్ల క్రితం పీఎంవో అంటే ఒక అధికార కేంద్రం అనే భావన ఉండేదని ప్రధాని మోదీ అన్నారు.
By Srikanth Gundamalla Published on 10 Jun 2024 7:02 PM ISTపీఎంవో అధికార కేంద్రంలా ఉండాలనేది నా విధానం కాదు: ప్రధాని మోదీ
నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత సోమవారం పీఎంవోలో బాధ్యతలను తీసుకున్నారు. ఆయన బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా.. పీఎంవో సిబ్బంది ప్రధాని మోదీకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మోదీ పీఎంవో సిబ్బందితో మాట్లాడారు. ప్రభుత్వం అంటే మోదీ ఒక్కరే కాదనీ.. ఎంతో మంది ఆలోచనల సమాహారమని అన్నారు. పదేళ్ల క్రితం పీఎంవో అంటే ఒక అధికార కేంద్రం అనే భావన ఉండేదని ప్రధాని మోదీ అన్నారు.
దేశంలో 2014 కి ముందు ఉన్న భిన్నమైన పరిస్థితులను మార్చేందుకు నిర్ణయాలనుతీసుకున్నామని ఈ సందర్బంగా ప్రధాని మోదీ చెప్పారు. పీఎంవో అంటే ఎప్పుడూ ప్రజల కోసమే పని చేయాలన్నారు. మోదీ పీఎంవోగా కాదు.. దేశం కోసమే పనిచేద్దామని పిలుపునిచ్చారు. దేశమే మనందరి మోటివేషన్ అని చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించుకుందామన్నారు. ఎలాంటి పరిమితులు లేకుండా పని చేసేవారే తన జట్టు సభ్యులు అని.. వారినే ఈ దేశం కూడా విశ్వసిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.
ఇప్పటి వరకు ఈ పదేళ్లలో తాను చేసినదానికంటే ఇంకా ఎక్కువ చేయాలని అనుకుంటున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని అందించడమే తన బాధ్యత అని చెప్పారు. జీవితంలో ఎప్పుడూ నేర్చుకోవాలని తపన ఉండాలని అన్నారు. ఇదే తన ఎనర్జీకి కారణమని అన్నారు. ఎవరైనా మీ ఎనర్జీకి కారణమేంటి అడితే.. ప్రతి వ్యక్తి లోపలి విద్యార్థిని సజీవంగా ఉంచుకోవాలని చెబుతానని అన్నారు. ఎప్పటికీ అలాంటి వ్యక్తి శక్తిహీనుడు అవ్వడని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.