ఎన్డీయేకు ఏపీ ప్రజలు అపూర్వ విజయం అందించారు: ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనాత్మక ఫలితాలు వెలువడ్డాయి.

By Srikanth Gundamalla  Published on  4 Jun 2024 9:19 PM IST
prime minister narendra modi,  election results, bjp,

ఎన్డీయేకు ఏపీ ప్రజలు అపూర్వ విజయం అందించారు: ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనాత్మక ఫలితాలు వెలువడ్డాయి. మెజార్టీ స్థానాలను గెలుచుకున్నాయి ఎన్డీయే కూటమి పార్టీలు. టీడీపీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంటే.. జనసేన ఏకంగా పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. అలాగే పోటీ చేసిన రెండు ఎంపీ స్థానాలనూ కైవసం చేసుకుంది. బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించగా.. అధికార పార్టీ వైసీపీ మాత్రం ఘోర ఓటమిని చూసింది.

తాజాగా ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఎన్డీఏ కూటమికి అపూర్వ విజయాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులు తమకు ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఘన విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్‌ సహా బీజేపీ నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు ప్రధాని మోదీ. ఇక ఏపీని రానున్న రోజుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

మరోవైపు మూడోసారి వరుసగా ఎన్డీఏ కూటమిని దేశ ప్రజలు నమ్మారని.. ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇదో చారిత్రక ఘట్టమని చెప్పారు. ప్రజల అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఎప్పుడూ పనిచేస్తూనే ఉన్నామనీ.. ఇక ముందు కూడా కొనసాగిస్తామని అన్నారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలందరికీ నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.

ఒడిశాలో అద్భుత విజయాన్ని అందించారనీ ప్రధాని మోదీ అన్నారు. తమ సుపరిపాలనే ఈ అఖండ విజయాన్ని అందించిందని చెప్పారు. ఒడిశా రాష్ట్ర ప్రజల కలలలను నెరవేర్చేందుకు ఏ అవకాశాన్ని బీజేపీ వదులుకోదని చెప్పారు. ఒడిశాను అభివృద్ధిలో ముందుంచుతామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

Next Story