ప్రధాని మోదీ విత్ మెగా బ్రదర్స్.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులకు మెగా అభిమానులు ఈరోజు పండుగ రోజు అనే చెప్పొచ్చు.
By M.S.R Published on 12 Jun 2024 4:30 PM ISTప్రధాని మోదీ విత్ మెగా బ్రదర్స్.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులకు మెగా అభిమానులు ఈరోజు పండుగ రోజు అనే చెప్పొచ్చు. ‘‘కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను" అనే వాయిస్ వినాలని మెగా అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసారు. అలాంటి శుభ సందర్భం ఇప్పుడు వారి కళ్ల ముందు కనిపించింది. ఇక కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను.. అంటూ పవన్ పలకగానే ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తల సంతోషం మిన్నంటింది. చప్పట్లు, కేకలతో సభా ప్రాంగణం మార్మోగింది. పవన్ ప్రమాణస్వీకారం అనంతరం వేదికపై ఉన్న గవర్నర్, ఇతర ప్రముఖులకు పవన్ కళ్యాణ్ నమస్కరించారు. అన్న చిరంజీవికి పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
ఇక ప్రమాణస్వీకార వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మెగా సోదరులను ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించారు. మెగాస్టార్ ఓవైపు, పవర్ స్టార్ ను మరోవైపు నిలబెట్టుకుని సభకు హాజరైన ప్రజలకు అభివాదం చేశారు. సీఎం, మంత్రుల ప్రమాణస్వీకారం పూర్తయ్యాక ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలకు పోజిచ్చారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పవన్ ను మోదీ అభినందించారు. ఆపై ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్ తన సోదరుడు చిరంజీవి వద్దకు తీసుకుని వెళ్లారు. మెగా సోదరులు ఇద్దరినీ దగ్గరకు తీసుకున్న మోదీ వేదిక పైనుంచి ప్రజలకు అభివాదం చేశారు.
గుండెల నిండా సంతోషంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి భవిష్యత్ ఉందన్న భరోసా కలుగుతోందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. రాష్ట్రంలో సమర్థులు, సుదీర్ఘ పాలనా అనుభవం, శక్తిసామర్థ్యాలు ఉన్న నాయకులు వచ్చారని, పాత-కొత్త కలయికలో ఈ మంత్రివర్గం చాలా బాగుందని అన్నారు. తన తమ్ముడు ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం పట్ల గర్వంగా అనిపిస్తోందని అన్నారు. ఎంతో కష్టపడిన తర్వాత వచ్చిన విజయం కావడంతో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉందని.. ప్రభుత్వంలో తన పాత్రను సమర్థంగా నిర్వర్తించగలడని, రాష్ట్ర భవిష్యత్తు కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తాడని పవన్ కళ్యాణ్ పై చిరంజీవి నమ్మకం వ్యక్తం చేశారు.