తొలిసారిగా బ్రూనై పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మరో చారిత్రాత్మక పర్యటనకు బయల్దేరారు.
By Srikanth Gundamalla
ప్రధాని నరేంద్ర మోదీ మరో చారిత్రాత్మక పర్యటనకు బయల్దేరారు. ఆయన తొలిసారిగా బ్రూనై దేశ పర్యనటకు వెళ్లారు. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 4 వరకు బ్రూనైలో ఆయన పర్యటిస్తారు. భారతదేశ విదేశాంగ శాఖ ఈ మేరకు వివరాలను తెలిపింది. ఈ పర్యటన ద్వారా బ్రూనైతో ద్వైపాక్షిక, ప్రాంతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొంది. కాగా.. సుల్తాన్ హసనల్ బోల్కియా ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోడీ బ్రూనైలో పర్యటించనున్నారు.
బ్రూనైకి చెందిన సుల్తాన్ హసనల్ బోల్కియా ప్రపంచ ధనికుల్లో ఒకరు. ఆయనే స్వయంగా ప్రధాని మోదీన ఆహ్వానించారు. సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభమయ్యే బ్రూనై పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి బోల్కియా ఆతిథ్యం ఇవ్వనున్నారు. భారత ప్రధాని బ్రూనైలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. సుల్తాన్ బోల్కియా సంపద దాదాపు 30 బిలియన్ డాలర్లు ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. సుల్తాన్ జీవన విధానం చాలా విలాసవంతమైనది. ఆయన ఇల్లు ‘ఇస్తానా నూరుల్ ఇమాన్’ ప్యాలెస్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాలెస్. 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్యాలెస్ 1984లో నిర్మితం అయ్యింది. బ్రిటన్ నుంచి బ్రూనై స్వాతంత్ర్యం పొందిన సమయంలో దీనిని నిర్మించారు. కాగా.. ప్రధాని బ్రూనై పర్యటన రక్షణ, వాణిజ్యం, ఇంధనం మరియు అంతరిక్ష సాంకేతికతతో సహా వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యమని పేర్కొన్నారు.
కాగా.. బ్రూనై పర్యటన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్‌కు వెళ్తారు. సింగపూర్‌లో కొత్త నాయకుడితో ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరిచేందుకు అవకాశం కల్పిస్తున్నందున ఈ పర్యటన కీలకమని పలువురు చెబుతున్నారు. మోదీ పర్యటనలో ముఖ్యంగా ఆహార భద్రత, పునరుత్పాదక, గ్రీన్ హైడ్రోజన్, సెమీకండక్టర్స్ వంటి అంశాల్లో పలు అవగాహన ఒప్పందాలు కుదరవచ్చని తెలుస్తోంది.