మోదీ శక్తివంతమైన నాయకుడు.. పుతిన్ ప్రశంసల వర్షం
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు.
By Srikanth Gundamalla Published on 9 July 2024 2:45 AM GMTమోదీ శక్తివంతమైన నాయకుడు.. పుతిన్ ప్రశంసల వర్షం
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా సోమవారం అక్కడికి చేరుకున్నారు. భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ఆయన కు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఘనస్వాగతం పలికారు. తన అధికారిక నివాసం నోవో-ఒగారియోవోలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని, విజయాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసించారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ప్రియమైన స్నేహితుడు అంటూ మోదీని పలకరించారు. మోదీని కలవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. భారత ప్రధానిగా మరోసారి ఎన్నికైన మోదీకి పుతిన్ శుభాకాంక్షలు చెప్పారు. మూడో సారి యాదృచ్ఛికంగా పీఎం కాలేదనీ.. భారత దేశ పురోగతికి కృషి చేశారంటూ అభినందించారు. చాలా ఏళ్లపాటు చేసిన కృషికి ఫలితంగా మరోసారి తిరిగి ప్రధాని అయ్యారంటూ మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు పుతిన్.
ప్రధాని మోదీ ఎప్పుడూ అంకితభావంతో పనిచేస్తారనీ.. ఆయన శక్తివంతమైన నాయకుడు అంటూ పుతిన్ చెప్పారు. చురుకై వ్యక్తి.. దేశ ప్రజల ప్రయోజనాల కోసం చక్కటి ఫలితాలను సాధించగలరని అన్నారు. భారత్ ప్రయోజనాల కోసం మోదీ చేస్తున్న కృషికి పుతిన్ అభినందనలు తెలిపారు. ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పటిష్టంగా ఉందని అన్నారు. కాగా. పుతిన్ అధికారిక నివాసంలో ఇరువురి మధ్య అనధికారిక చర్చల సందర్భంగా రష్యా అధ్యక్షుడు ఈ కామెంట్స్ చేశారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ప్రధాని మోదీ రష్యాకు వెళ్లడం ఇదే తొలిసారి. కాగా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం విస్తృత చర్చలు జరపనున్నారు. సమావేశాల తర్వాత ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని రష్యా మీడియా వర్గాలు చెబుతున్నాయి.