వరంగల్‌కు రానున్న ప్రధాని మోదీ.. భారీ ఏర్పాట్లు చేస్తోన్న బీజేపీ
జూలై 8న వరంగల్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు.
By Srikanth Gundamalla Published on 29 Jun 2023 4:12 PM ISTవరంగల్‌కు రానున్న ప్రధాని మోదీ.. భారీ ఏర్పాట్లు చేస్తోన్న బీజేపీ
త్వరలోనే తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ పర్యటన అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేశారు. జూలై 8న వరంగల్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని టూర్‌ను రాజకీయంగా ఉపయోగించుకోవాలని తెలంగాణ బీజేపీ నాయకులు భావిస్తున్నారు. దాంతో.. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
వరంగల్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కాజీపేట వ్యాగన్ ఓరలింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. ప్రధాని వరంగల్ పర్యటన సందర్భంగా తెలంగాణ బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ బీజేపీలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో మోదీ వరంగల్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు.. ఇటీవల ప్రధాని మోదీ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు.. ఎమ్మెల్సీ కవితపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరి వరంగల్ పర్యటన సందర్భంగా ఏదైనా మాట్లాడతారా అనేది వేచి చూడాలి. ఇక జూలై 8న హైదరాబాద్ జేపీ నడ్డా అధ్యక్షతన జరగాల్సిన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం వాయిదా పడింది.