అమెరికాకు బయల్దేరిన ప్రధాని మోదీ.. టూర్ షెడ్యూల్‌ ఇదే..

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు బయల్దేరారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అమెరికాకు

By Srikanth Gundamalla  Published on  20 Jun 2023 10:35 AM IST
PM Modi, America Tour, Biden

అమెరికాకు బయల్దేరిన ప్రధాని మోదీ.. టూర్ షెడ్యూల్‌ ఇదే..

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు బయల్దేరారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అమెరికాకు వెళ్లారు. జూన్ 20వ తేదీ నుంచి మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఇండో-అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ టూర్‌ మంచి అవకాశం కల్పిస్తుందని పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ చెప్పారు. రెండు దేశాలు ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో కలిసి బలంగా నిలబడుతున్నాయన్నారు. యూస్ టూర్‌లో ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు బైడెన్‌ సహా.. ఇతర నాయకులతో చర్చలు జరపనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడతాయని చెప్పారు ప్రధాని మోదీ. అమెరికా పర్యటన తర్వాత ప్రధాని నేరుగా ఈజిప్టు వెళ్తారు. ఆ తర్వాత జూన్ 25న రెండు దేశాల పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ తిరిగి ఇండియాకు రానున్నారు.

ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్:

ప్రధాని మోదీ జూన్‌ 20న న్యూయార్క్‌కు వెళ్తారు. అక్కడ మోదీకి అండ్రూస్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ వద్ద భారతీయ అమెరికన్ల బృందం స్వాగతం పలకనుంది. ఇక జూన్‌ 21న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఆయన ఈ వేడుకులకు నాయకత్వం వహించనున్నారు కూడా. యూఎస్‌ ప్రధాన కార్యాలయం నుంచి మోదీ వాషింగ్టన్‌ డీసీకి వెళ్తారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్‌బైడెన్‌ మోదీకి స్వాగతం పలుకుతారు. వారితో కలిసి ప్రధాని మోదీ ప్రైవేట్‌ విందులో పాల్గొంటారు.

జూన్‌ 22న ప్రధాని మోదీకి వైట్ హౌస్‌ వద్ద లాంఛనప్రాయ స్వాగతం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో పాటు వెయ్యి మందికి పైగా స్థానికులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్వాగత కార్యక్రమం తర్వాత బైడెన్‌తో కలిసి ప్రధాని మోదీ ఉన్నతస్థాయి చర్చలు జరపనున్నారు. రెండు దేశాల ఆర్థిక, సాంకేతిక, పర్యావరణ వ్యవస్థల మధ్య సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ చర్చలు దోహదపడతాయని ఈ దేశాల ప్రతినిధులు, అధికారులు చెబుతున్నారు. ఈ చర్చల తర్వాత కాంగ్రెస్‌ నేతల ఆహ్వానం మేరకు అదేరోజు మధ్యాహ్నం ఆ పార్టీ సంయుక్త సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. బైడెన్, జిల్‌ బైడెన్‌ సాయంత్రం ప్రధాని మోదీ గౌరవార్థం స్టేట్‌ డిన్నర్‌ను ఏర్పాటు చేస్తారు. వందల మంది అతిథులు, కాంగ్రెస్ సభ్యులు, పలువురు ప్రముఖులో ఇందులో పాల్గొంటారు.

జూన్ 23న ప్రధాని మోదీకి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్, రాష్ట్ర కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ కలిసి లంచ్‌ ఆతిథ్యం ఇస్తారు. అనంతరం పలువురు సీఈవోలు, పలు రంగాల నిపుణులతో చర్చలు జరుపుతారు ప్రధాని మోదీ. సాయంత్రం రోనాడ్ల్‌ రీగన్‌ సెంటర్‌లో మెగా ఈవెంట్‌లో పాల్గొని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగం చేస్తారు.

అమెరికా పర్యటన తర్వాత జూన్ 24న ప్రధాని మోదీ ఈజిప్టుకు వెళ్తారు. ఈజిప్టులో ప్రధాని మోదీ పర్యటించడం ఇదే మొదటిసారి. ఆ దేశ అధ్యక్షులు అబ్దెల్ ఫతాహ్‌ ఎల్‌-సిసిని కలుస్తారు. ఇరు దేశాల మధ్య సంబంధాలపై చర్చలు జరుగుతాయి. ఆ తర్వాత జూన్ 25న భారత్‌కు తిరిగి రానున్నారు ప్రధాని మోదీ.

Next Story