పోలీస్ స్టేషన్‌లో ప్రీవెడ్డింగ్ షూట్‌పై స్పందించిన సీపీ

స్టేషన్‌లో పోలీస్ దంపతుల ప్రీ వెడ్డింగ్ షూట్‌పై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు.

By Srikanth Gundamalla  Published on  17 Sep 2023 11:14 AM GMT
Panjagutta, Police Station, Pre wedding Shoot, CP Anand,

 పోలీస్ స్టేషన్‌లో ప్రీవెడ్డింగ్ షూట్‌పై స్పందించిన సీపీ 

పెళ్లి అనగానే ఫొటోలు.. కొత్త బట్టలు.. ప్రీవెడ్డింగ్ షూట్‌ గుర్తొస్తాయి. అయితే.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పోలీస్‌ దంపతులు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నారు. పోలీసులు అయినా కూడా పోలీస్‌ స్టేషన్‌ను, యూనిఫాం, పోలీస్‌ వెహికల్‌ను ఫొటోల కోసం వినియోగించుకోవడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు పోలీసులు అయ్యి ఉండి బాధ్యతగా వ్యవహరించకుండా స్టేషన్‌లో ప్రీవెడ్డింగ్ షూట్ నిర్వహిస్తారా అని మండిపడుతున్నారు. ఇంకొందరు అయితే.. చేస్తే తప్పేం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో ఈ పోలీస్‌ దంపతులను విమర్శిస్తున్న వారు అయితే.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో వైరల్ కావడం.. వివాదాస్పదంగా మారడంతో హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు.

స్టేషన్‌లో పోలీస్ దంపతుల ప్రీ వెడ్డింగ్ షూట్‌ నిర్వహణపై స్పందించిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్టు పెట్టారు. ఈ వీడియోకు మిశ్రమ స్పందనను చూశానని చెప్పుకొచ్చారు. పెళ్లి చేసుకోవడం మంచి విషయం అని అన్నారు సీపీ సీవీ ఆనంద్. పెళ్లి గురించి ఈ జంట ఎగ్జైట్‌మెంట్‌తో కూడా ఉన్నారని అన్నారు. అయితే.. ప్రీవెడ్డింగ్‌ షూట్‌ చూస్తే కాస్త ఇబ్బందిగా ఉందని మాత్రం అన్నారు సీపీ. పోలీసింగ్ అనేది చాలా కఠినమైన పని అనీ.. ముఖ్యంగా మహిళలకు మరింత కష్టంగా ఉంటుందన్నారు. డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం మంచి విషయం అని సీపీ పేర్కొన్నారు. దంపతులు పోలీసులు కావడం వల్ల డిపార్ట్‌మెంట్‌ ఆస్తులు, చిహ్నాలను ఉపయోగించడం తప్పుగా అనిపించలేదని సీపీ సీవీ ఆనంద్‌ ట్వీట్ చేశారు.

స్టేషన్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్‌ చేసుకున్న ఈ వీడియో చూస్తే కొందరు ఆగ్రహం వ్యక్తం చేయొచ్చని అన్నారు సీవీ ఆనంద్. అయితే.. దంపతులు ముందే తెలియజేసి ఉంటే షూట్‌కి కచ్చితంగా అనుమతి ఇచ్చి ఉండేవాళ్లమని తెలిపారు. సరైన అనుమతి లేకుండా ఇలా మాత్రం వ్యవహరించొద్దని సూచించారు. మరోసారి పునరావృతం చేయొద్దని ఇతరులకు సలహా ఇస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. అయితే.. సదురు దంపతులు పెళ్లికి పిలవపోయినప్పటికీ.. వారిని కలిసి ఆశీర్వదించాలని భావిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. తాజాగా సీపీ స్పందనతో సదురు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారని.. వారిపై చర్యలు ఉండబోవని తెలుస్తోంది.

Next Story