పల్నాడు కలెక్టర్‌గా లత్కర్ శ్రీకేశ్ బాలాజీ, ఈసీ ఉత్తర్వులు
పల్నాడు కలెక్టర్‌గా లత్కర్ శ్రీకేశ్ బాలాజీని నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం.
By Srikanth Gundamalla Published on 18 May 2024 4:41 PM ISTపల్నాడు కలెక్టర్‌గా లత్కర్ శ్రీకేశ్ బాలాజీ, ఈసీ ఉత్తర్వులు
పల్నాడు కలెక్టర్‌గా లత్కర్ శ్రీకేశ్ బాలాజీని నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. శనివారం రాత్రి 7 గంటల వరకు బాధ్యతలను చేపట్టాలని ఈ మేరకు ఉత్తర్వుల్లో పేర్కొంది ఈసీ. పల్నాడు జిల్లాలో ఎన్నికల సందర్భంగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మే 13వ తేదీన లోక్‌సభ ఎన్నికలతో పాటు.. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగింది. పోలింగ్ రోజు, ఆ తర్వాత అనేక జిల్లాల్లో అల్లర్లు చెలరేగాయి. ఎన్నికల వేళ హింసాత్మక సంఘటనలు జరగడంపై ఈసీ సీరియస్ అయ్యింది. సీఎస్, జవహర్‌రెడ్డితో పాటు డీజీపీతో సమావేశం అయ్యింది. ఆయా సంఘటనలపై వివరణ తీసుకుంది. ఈ క్రమంలోనే మూడు జిల్లాలకు చెందిన కీలక ఉన్నతాధికారులపై కొరడా ఝులిపించింది. ఎన్నికల వేళ విధుల నిర్వహణలో విఫలమైనందుకు ఈ చర్యలను తీసుకుంది. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసింది. వారిద్దరినీ వెంటనే విధుల్లో నుంచి తప్పించి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్, డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు వారిపై చర్యలకు ఆదేశించింది.
తాజాగా మూడు జిల్లాలకు కూడా కొత్త ఎస్పీలను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లా ఎస్పీగా మలికా గార్గ్, తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్దన్, అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి సాలిలను నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం.