పాక్‌కు భారీ షాక్‌.. 188 దేశాల్లో పాక్‌ ఎయిర్‌లైన్స్‌ రాకపోకలపై నిషేధం

పాకిస్థాన్‌కు భారీ షాక్ తగలనుంది. తమ దేశంలో ఉన్న 860 మంది పైలట్లలో దాదాపు 262 మంది బోగస్‌ పైలట్లేనన్న ప్రకటన

By సుభాష్  Published on  9 Nov 2020 6:48 PM IST
పాక్‌కు భారీ షాక్‌.. 188 దేశాల్లో పాక్‌ ఎయిర్‌లైన్స్‌ రాకపోకలపై నిషేధం

పాకిస్థాన్‌కు భారీ షాక్ తగలనుంది. తమ దేశంలో ఉన్న 860 మంది పైలట్లలో దాదాపు 262 మంది బోగస్‌ పైలట్లేనన్న ప్రకటన పాకిస్థాన్‌ ఎయిర్‌ లైన్స్‌ పై తీవ్ర ప్రభావం చూపనుంది. లైసెన్స్‌ కుంభ కోణం కారణంగా దాదాపు 188 దేశాల్లో పాక్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ లైన్స్‌ రాకపోకలపై నిషేధం విధించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌ ప్రమాణాలు పాటించకుండా నిబంధనలకు విరుద్దంగా పైలట్‌ లైసెన్స్‌లు జారీ చేసిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. కాగా, పైలట్‌ శిక్షణ, లైసెన్స్‌ల జారీ విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లు లేవంటూ ఐసీఏవో, నవంబర్‌ 3న పాక్‌ ఏవియేషన్‌ అథారిటీకి లేఖ రాసింది. ఈ విషయమై అనేకమార్లు హెచ్చరించినా పాక్‌ తీరులో మార్పు రాకపోవడంతో పాక్‌ విమానాలు, పైలట్లపై నిషేధించే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొంది.

ఇదే నిజమైతే తీవ్ర పరిణామాలుంటాయి..

కాగా, ఈ విషయమై పాక్‌ ఎయిర్‌ లైన్స్‌ పైలట్స్‌ అసోసియేషన్‌ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఇదే కనుక నిజమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, పాక్‌ పౌరవిమాన రంగం కుప్పకూలిపోతుందని, ఆరేళ్లుగా ఈ విషయం గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నామన్నారు. కానీ వారు ఏ మాత్రం పట్టించకోలేదని, వారి నిర్లక్ష్యం కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ విషయంలో ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ జోక్యం చేసుకుని స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.

కాగా, లైసెన్స్‌ కుంభకోణం కారణంగా యూరోపియన్‌ యూనియన్‌ ఎయిర్‌ సేఫ్టి ఏజన్సీ ఇప్పటికే పాక్‌ కు భారీ షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. పాక్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాలను ఈయూ విమానాలను సభ్య దేశాల్లోకి అనుమతించే ప్రసక్తే లేదని తెలుపుతూ జూలైలో నిషేధం విధించింది. ఇప్పుడు ఏకంగా 188 దేశాలకు వీటి రాకపోకలు నిషేధించేందుకు ఐసీఏవో సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ ఘటనపై విచారిస్తే బోగస్‌ లైసెన్స్‌ల కథ బయటపడింది

అయితే ఈ ఏడాది మే 22న పాక్‌లోని కరాచీలో ఓ విమానం జనవాసాల్లో కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 97 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన ఇమ్రాన్‌ఖాన్‌ సర్కార్‌.. ప్రమాదానికి పైలట్‌ నిర్లక్ష్యమని తేలింది. ఇందుకు సంబంధించిన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించిన పాక్‌ విమానయాన శాఖ మంత్రి గులాం సర్వార్‌.. విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం లేదని, పైలట్‌దే తప్పిదమని తేలింది. ఈ లోతుగా దర్యాప్తు చేపట్టిన పాక్‌ ప్రభుత్వం.. తమ దేశంలో 262 మంది బోగస్‌ పైలట్లు ఉన్నారని గుర్తించింది. అంతేకాకుండా వీరంతా వేరొకరితో పరీక్ష రాయించి విధుల్లో చేరినట్లు ప్రభుత్వం తేల్చింది. ఈ నేపథ్యంలో విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.

Next Story