కొండెక్కిన ఉల్లి ధర.. మరింత పెరగనుందా..?

తెలంగాణలో రోజురోజుకు ఉల్లిగడ్డ ధర పైపైకి ఎగబాకుతుండటంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.

By Srikanth Gundamalla  Published on  30 Oct 2023 5:02 AM GMT
onion prices, increased,  telangana,  supply demand,

కొండెక్కిన ఉల్లి ధర.. మరింత పెరగనుందా..?

ప్రజలకు ఈ మధ్యకాలంలో ఓ పాట బాగా గుర్తుకు వస్తోంది. అదే ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు. మొన్నటి వరకు దేశంలో టమాటా ధర ఏవిధంగా ఉండిందో అందరికీ తెలిసిందే. ఒకానొక సమయంలో కిలో టమాటా 200 రూపాయలకు పైగానే పలికింది. దాంతో.. సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు రైతులు అయితే.. ధర ఎక్కువగా ఉన్న సమయంలో చేతికి పంట వచ్చి కోటీశ్వరులు అయ్యారు కూడా. అయితే.. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. కొన్ని నెలల క్రితం టమాటా ధరలు చుక్కలు చూపిస్తే.. ఇప్పుడు ఉల్లి వంతు వచ్చింది. సాధారణంగా ఉల్లిని కోస్తే జనాలకు కళ్లలో నీళ్లు వస్తాయి. కానీ.. ఇప్పుడు ఉల్లిని కొనాలంటేనే కళ్లలో నీళ్లు తిరిగే పరిస్థితులు.

తెలంగాణలో రోజురోజుకు ఉల్లిగడ్డ ధర పైపైకి ఎగబాకుతుండటంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఉల్లి ధరలు రెండు రెట్లకు పైగా పెరిగాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ ఉల్లిగడ్డ 80 రూపాయల వరకు పలుకుతోంది. హోల్‌సేల్‌ దుకాణాల్లో రూ.60-70 వరకు పలుకుతోంది. చిన్న వ్యాపారులు ఉల్లిని కేజీ రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. రెగ్యులర్‌గా ఉల్లి వంద రూపాయలకు 5 నుంచి 6 కిలోల వరకు లభించేది. కానీ.. ఇప్పుడు వంద రూపాయలు పెట్టినా కిలో మాత్రమే లభిస్తుండటంతో..దాన్ని కొనాలంటే భయపడిపోతున్నారు. ఈ ధరల నేపథ్యంలో ఏం కొనలేం.. ఏం తినలేమని చెబుతున్నారు.

ఈసారి ఆలస్యంగా రుతుపవనాలు రావడంతోనే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉల్లి పంటపైనా తీవ్ర ప్రభావం పడిందని అంటున్నారు. కొత్త ఉల్లి పంట మార్కెట్‌లోకి ఇంకా రావడం లేదని.. అందుకే ధరలు భారీగా పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. కాగా.. వర్షాకాలంలో కర్ణాటకలోని రైతులు ఉల్లిని బాగా పండిస్తారు. కొన్నేళ్లుగా సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి రుతుపవనాల ఆలస్యం కావడంతో క్షేత్రస్థాయిలో రైతులు ఉల్లి సాగుపై పెద్దగా ఆసక్తి చూపటం లేదు. అకాల వర్షాలు, వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు చేసిన వేల హెక్టార్ల ఉల్లి పంట చేతికి అందకుండా పోవటంతో అది ధరలపై ప్రభావం చూపింది.

కర్ణాటక నుంచి ఉల్లి సరఫరా తగ్గిపోవడంతో మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేస్తున్నారు. దీపావళి వరకు ఉల్లి ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో కేజీ ఉల్లి ధర రూ.100 దాటే అవకాశాలూ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక మరోవైపు టమాటా ధర కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది.

Next Story