Hyderabad: ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద తారక్‌ ఫ్లెక్సీల తొలగింపు

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబ సభ్యలు ఘనంగా నివాళులు అర్పించారు.

By Srikanth Gundamalla  Published on  18 Jan 2024 12:20 PM IST
ntr ghat, tarak flexi, removed, viral video,


Hyderabad: ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద తారక్‌ ఫ్లెక్సీల తొలగింపు  

నందమూరి తారకరామారావు 28వ వర్ధంతి జరుగుతోంది. అయితే.. సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబ సభ్యలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పెద్ద పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే...గురువారం తెల్లవారుజామునే జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్‌రామ్‌ ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. వారు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న అభిమానులు అప్పటికే ఎన్టీఆర్ ఘాట్‌ వద్దకు వెళ్లారు. ఎన్టీఆర్‌ను చూసేందుకు ఎగబడ్డారు. ఎన్టీఆర్ సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు.

కాగా.. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ ఘాట్‌ వద్దకు వచ్చారు. ఆయన తండ్రి సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అయితే.. ఆయన అలా వెళ్లిన కాసేపటికే ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద ఊహించని పరిణామాలు జరిగాయి. జూనియర్‌ ఎన్టీఆర్ ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను అన్నింటినీ తొలగించారు. అయితే.. బాలకృష్ణ ఆదేశాల మేరకే ఎన్టీఆర్ ఫొటోలను తొలగించారంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. బాలకృష్ణ ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు వచ్చి.. కోపంతో తీసేయ్‌ అంటూ ఆదేశాలు జారీ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. బాలకృష్ణ అలా వెళ్లిపోయిన మరుక్షణమే అక్కడున్న ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలకృష్ణ అభిమానులు తొలగించారు. స్వయంగా ఎన్టీఆర్ సమాధి వద్ద నందమూరి కుటుంబంలో విబేధాలు బయటపడ్డాయంటూ చర్చించుకుంటున్నారు.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్‌ ఫ్లెక్సీలను తొలగించడంపై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. కొంత కాలంగా టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీలను తొలగించడం వంటి అంశం ఎంత వరకు వెళ్తుందనేది ఆసక్తిగా మారింది.

Next Story