ఇమ్రాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం

By -  Nellutla Kavitha |  Published on  28 March 2022 3:04 PM GMT
ఇమ్రాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం

పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై ఆ దేశ పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దిగువ సభలో ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానాన్ని స్వీకరించడంపై డిప్యూటీ స్పీకర్ సభలో ఓటింగ్ జరిపారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు ప్రతిపక్షాలకు చెందిన 161 మంది ఎంపీలంతా సభకు హాజరు అయ్యారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఎంపీలు ఎవరూ హాజరు కాలేదు. 161 మంది ప్రతిపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు కాబట్టి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇస్తున్నానని డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. ఇక అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఆ తర్వాత ఓటింగ్ మార్చి 31వ తేదీన జరుగుతుంది.

పాకిస్తాన్ పార్లమెంట్ లో ఎంపీల సంఖ్య 342. సభలో తమకు బలం ఉందని నిరూపించుకోవాలి అంటే ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వానికి 172 ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది. అయితే ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన ఎంపీలు రెబెల్స్ గా మారడంతో ఇప్పుడు ఇమ్రాన్ఖాన్ పదవికి గండం ఏర్పడింది. అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా 24 మంది ఓటు వేయాలని పిలుపునిచ్చారు. దిగువ సభలో ప్రభుత్వానికి 155 సీట్లు మాత్రమే ఉన్నాయి. ప్రతిపక్ష ఎంపీలతో పాటు రెబెల్ ఎంపీలు కలుపుకుంటే 172 కంటే ఎక్కువ వస్తుంది. వీరంతా ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆయన ప్రధాని పీఠం దిగి పోవాల్సిందే.

గతంలో రెండు సార్లు పాకిస్థాన్ ప్రధాన మంత్రుల మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో తోపాటుగా మరో ప్రధాన మంత్రి షౌకాత్ అజీజ్ అవిశ్వాస తీర్మానాన్ని ఓడించారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పిటిఐ పార్టీకి ఉన్న 150 మంది ఎంపీలు, మిత్రపక్షాల సహకారంతో మాత్రమే ఆయన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ప్రతిపక్షాల సంఖ్య ఇంతకంటే ఎక్కువగానే ఉంది. మరి అవిశ్వాస తీర్మానం లో ఇమ్రాన్ ఖాన్ ఓడిపోతారా, నెగ్గుతారా అనేది ఆసక్తిగా మారింది.

Next Story