బాక్సింగ్ లో స్వర్ణం సాధించిన మన నిఖత్ జరీన్
By - Nellutla Kavitha | Published on 19 May 2022 4:29 PM GMTప్రపంచ బాక్సింగ్ 52 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది భారత బాక్సర్ నిఖత్ జరీన్. ఫైనల్ లో థాయిలాండ్ కు చెందిన జిట్ పాంగ్ పై నిఖత్ చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. తెలంగాణ, నిజామాబాద్‌కు చెందిన నిఖత్ ఈ విజయంతో మేరీ కోం, సరితా దేవిల సరసన నిలిచింది. టర్కీ ఇస్తాంబుల్ లో ఈ ప్రపంచ చాంపియన్ షిప్ పోటీ జరిగింది.
మరోసారి ప్రపంచ బాక్సింగ్ వేదికపై భారత బాక్సర్లు సత్తా చాటారు. నిన్న ఇస్తాంబుల్‌లో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ సెమీఫైనల్ లో విజయం సాధించిన నిఖత్ ఈరోజు కూడా అదే జోరు కొనసాగించింది. సెమీఫైనల్ బౌట్‌లో బ్రెజిల్‌కు చెందిన కరోలిన్ డి అల్మెడాను 5-0తో సునాయాసంగా ఓడించిన నిఖత్, తన తొలి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దూకి తన దూకుడుతో స్వర్ణ పతకాన్ని సాధించింది.
కొద్దిసేపటి క్రితం జరిగిన ఫైనల్లో నిఖత్ జరీన్ థాయ్‌లాండ్‌కు చెందిన జిట్‌పాంగ్ తో తలపడి విజేతగా నిలిచింది. ఇంతకుముందే జూనియర్స్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన నిఖత్, 52 కేజీల విభాగంలోనూ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచే భారత్ కు వస్తానని ధీమాగా చెప్పింది, చెప్పినట్టే చేసింది మన అమ్మాయి. ఇదే ఫార్మాట్ లో తలపడ్డ ఇతర భారత మహిళా బాక్సర్లు మనీషా, పర్వీన్‌లు కూడా కాంస్య పతకాలను సాధించారు.