అలర్ట్..నేటి నుంచి కొత్త రూల్స్, జరిగే మార్పులు ఇవే
నేటి నుంచి (మే 1వ తేదీ) నుంచి కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి.
By Knakam Karthik
అలర్ట్..నేటి నుంచి కొత్త రూల్స్, జరిగే మార్పులు ఇవే
నేటి నుంచి (మే 1వ తేదీ) నుంచి కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. బ్యాంకు ఖాతా నిబంధనల నుంచి ఏటీఎం లావాదేవీలు, వంటగ్యాస్ ధరలు, కొన్ని బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు, ఇన్‌కం ట్యాక్స్ ఐటీఆర్ ఫైల్ లాంటి చాలా విషయాల్లో మార్పులు రానున్నాయి. ఈ కొత్త నియమాల గురించి తెలుసుకుందాం.
ఏటీఎం విత్‌డ్రా ఛార్జీల పెంపు
ATM ఉపసంహరణ ఛార్జీల పెరుగుదల ఏటీఎంల నుంచి నగదు తీసుకోవడానికి ఇకపై వినియోగదారులు మరిన్ని ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ఆర్‌బీఐ ప్రకటించింది. గతంలో ఈ ఛార్జీ రూ.21 ఉండగా, ఇప్పుడు దానిని రూ.23కి పెంచనున్నారు. ఈ కొత్త ఛార్జీ మే 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది.
రైల్వేలలో ఏమి మారుతుంది?
మే 1, 2025 నుంచి రైల్వే టికెట్ బుకింగ్ నిబంధనల్లో కొన్ని మార్పులు రానున్నాయి. ప్రయాణం చేసేవారు ఈ కొత్త విధానానికి అనుగుణంగా సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇకపై వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కేవలం జనరల్ కోచ్‌లో మాత్రమే చెల్లుబాటు అవుతాయి. స్లీపర్ కోచ్‌లో వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో ప్రయాణించడానికి వీలు లేదు. దీనితో పాటు, అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్‌ను 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించారు. అంటే మీరు మీ టికెట్‌ను 60 రోజుల ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఒకే దేశం.. ఒకే ఆర్‌ఆర్‌బీ' పథకం అమలు
మే 1 నుంచి దేశంలోని 11 రాష్ట్రాల్లో 'ఒకే దేశం.. ఒకే ఆర్‌ఆర్‌బీ' పథకం అమలులోకి రానుంది. ఇందులో భాగంగా ఆ రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను కలిపి ఒక్క పెద్ద ఆర్‌ఆర్‌బీగా మారుస్తారు. ఈ మార్పు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో అమలవుతుంది. దీని వల్ల బ్యాంకింగ్ సేవల ప్రాప్తత పెరిగి, వినియోగదారులకు మరింత సౌలభ్యం కలిగే అవకాశం ఉంది.
LPG సిలిండర్ ధరల్లో మార్పు
ఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రతి నెల మొదటి తేదీ లాగానే, మే 1న కూడా ఎల్పీజీ సిలిండర్ ధరలపై సమీక్ష జరగనుంది. ఈ సమీక్ష ఆధారంగా సిలిండర్ ధరలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. పెరిగితే, వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.
FD, సేవింగ్స్ ఖాతాల వడ్డీ రేట్లలో మార్పు
ఎఫ్‌డీ, సేవింగ్స్ ఖాతాల వడ్డీ రేట్లలో మార్పు మే 1 నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD), సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లలో మార్పులు జరగనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు సార్లు రెపో రేటు తగ్గించిన నేపథ్యంలో, చాలా బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను తగ్గించాయి. దీని ప్రభావంగా కొత్త డిపాజిట్లు పెట్టే వారికి తక్కువ వడ్డీ వచ్చే అవకాశం ఉంది.