నరేంద్ర మోదీ అను నేను.. ప్రధాని ప్రమాణస్వీకారం
నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
By Srikanth Gundamalla Published on 9 Jun 2024 7:54 PM ISTనరేంద్ర మోదీ అను నేను.. ప్రధాని ప్రమాణస్వీకారం
నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈశ్వరుడి మీద ప్రధాని మోదీ ప్రమాణం చేశారు. స్వతంత్ర భారతంలో నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలిచారు. ఆయన పేరిట రికార్డును లిఖించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు.. పలువురు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులుగా రాజ్‌నాథ్ సింగ్, అమిత్‌షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రమాణస్వీకారం చేశారు.
ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో వివిధ దేశాధినేతలతో పాటు సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరు అయ్యారు. వీరితో పాటు.. భూటాన్ పీఎం షేరింగ్ తోబ్‌గే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయిజ్జు, శ్రీలంక అధ్యక్షుడు విక్రం సింఘే, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, మణిపూర్ సీఎం బీరెన్ సింగ్, ఉత్తరాఖండ్ సీఎం దామీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్, సూపర్ స్టార్ రజనీకాంత్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ పాల్గొన్నారు.
కాగా.. 2014లో మోదీ తొలిసారిగా ప్రధాని బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత వరుసగా 2019 ఎన్నికల్లో కూడా ఘన విజయం సాదించడంతో మరోసారి ప్రధాని అయ్యారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాల పార్టీల సాయంతో ప్రధాని ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలను తీసుకున్నారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత అంతటి ఘనత సాధించిన నేతగా మోదీ చరిత్ర సృష్టించారు. నెహ్రూ తర్వాత ఏ ప్రధాని కూడా వరుసగా మూడుసార్లు అధికారంలో కొనసాగలేదు. 1950 సెప్టెంబర్ 17న పుట్టిన మోదీ.. రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎదిగారు. 2001లో తొలిసారి గుజరాత్ సీఎం అయ్యారు. ఆ తర్వాత నుంచి ప్రధానిస్థాయి వరకు ఎదుగుతూ వచ్చారు.