మేడిగడ్డ బ్యారేజ్‌ బ్రిడ్జి కుంగిన ఘటనపై రాష్ట్రానికి కేంద్రం డెడ్‌లైన్

మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిన ఘటన పై కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది.

By Srikanth Gundamalla  Published on  28 Oct 2023 4:00 PM IST
medigadda barrage, central govt, deadline, telangana govt,

మేడిగడ్డ బ్యారేజ్‌ బ్రిడ్జి కుంగిన ఘటనపై రాష్ట్రానికి కేంద్రం డెడ్‌లైన్

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిన ఘటన తెలంగాణలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర బృందం దర్యాప్తు కూడా చేస్తోంది. విచారణ జరుగుతుండగనే కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. తాము కోరిన సమాచారం వెంటనే ఇవ్వాలని జాతీయ డ్యామ్ భద్రత అథారిటీ అల్టిమేటం ఇచ్చింది. ఆదివారంలోగా వివరాలు ఇవ్వాలని ఆదేశిస్తూ ఓ లేఖను పంపింది. ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు కేంద్ర కమిటీ వంతెనను పరిశీలించింది. ఈ సమయంలో నిపుణుల బృందం ప్రభుత్వాన్ని 20 అంశాలపై సమాచారం ఇవ్వాలని సూచించింది. అయితే.. దీనిపై కొంతమేరే ప్రభుత్వం సమాచారం తిరిగి అందించింది. ఈ నేపథ్యం 20 అంశాలపై సమాచారం ఇవ్వాలంటూ తాజాగా జాతీయ డ్యామ్ భద్రత సిబ్బంది ఆదేశాలు జారీ చేసింది.

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు గల కారణాలు పరిశీలించేందుకు కేంద్ర కమిటీ ప్రాజెక్టును సందర్శించింది. ఆ సమయంలో బృంద సభ్యులు మొత్తం 20 అంశాల సమాచారాన్ని కోరగా, ప్రభుత్వం 3 అంశాల వివరాలు మాత్రమే ఇచ్చిందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మరోసారి పూర్తి సమాచారం కోరుతూ లేఖ రాశారు. ఆదివారంలోగా అడిగిన సమాచారం ఇవ్వాలని ఆల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ, సమాచారం ఇవ్వకుంటే ప్రాజెక్టుకు సంబంధించిన ఈ డాక్యుమెంట్లను లేనట్లుగా భావిస్తామని, ఆ మేరకు తదుపరి చర్యలుంటాయని వెల్లడించారు. అయితే, మేడిగడ్డ బ్యారేజీ ఫిల్లర్ల కుంగుబాటు తర్వాత బ్యారేజీని పరిశీలించిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలోని కేంద్ర బృందం వారంలోగా సమగ్ర నివేదిక ఇవ్వనుందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈ బృందం ప్రాథమిక నివేదికలో పూర్తి వివరాలు లేవని, రాష్ట్ర ప్రభుత్వ వివరణ అనంతరం పూర్తి నివేదిక సిద్ధమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

మేడిగడ్డ బ్యారేజ్‌లో 20వ పిల్లర్ కుంగుబాటు గురైన నేపత్యంలో అయిదారు పిల్లర్స్‌కు కూడా స్వల్పంగా పగుళ్లు ఏర్పడినట్లు నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది. మొదట బ్యారేజీ ఎగువన కాఫర్ డ్యాం నిర్మాణం, నీటిని తోడిపోయడం, పునాది వరకూ పరిశీలన, బ్యారేజీలో ఎగువ, దిగువ కటాఫ్ వాల్స్ పరిస్థితిపై అధ్యయనం చేయనున్నారు. అనంతరం నిపుణులను సంప్రదించి నిర్మాణ సంస్థతో పునరుద్ధరణ పనులు చేయించనున్నారు. ఇప్పటికే దీనిపై ఓ షెడ్యూల్ రూపొందించినట్లు తెలుస్తోంది. కాగా.. మహాదేవపూర్ మండలం అంబటిపల్లి వద్ద మేడిగడ్డ బ్యారేజీ బ్రిడ్జి ఈ నెల 21న కుంగిన విషయం తెలిసిందే.

Next Story