మాస్కులను తప్పనిసరి చేసిన మరో రాష్ట్రం
By - Nellutla Kavitha | Published on 21 April 2022 3:16 PM ISTదేశంలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో మరో రాష్ట్రం కూడా మాస్కులను తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని, లేకుంటే ఐదువందల రూపాయల జరిమానా ఉంటుందంటూ ఢిల్లీ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈరోజు పంజాబ్ రాష్ట్రం కూడా మాస్కులను తప్పనిసరి చేస్తూ ఆర్డర్ రిలీజ్ చేసింది. ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకుంటున్నపుడు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ తో పాటుగా క్లాస్ రూమ్ లో ఆఫీసులు, ఇండోర్ ప్రదేశాల్లో కూడా మాస్కులు తప్పనిసరిగా వాడాలని పంజాబ్ రాష్ట్రం ఉత్తర్వులు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్కులు తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులను జారీ చేశారు.
కొన్ని చోట్ల నాలుగో వేవ్ ప్రారంభం అయింది, అయినా తెలంగాణలో మాత్రం పాజిటివిటీ రేట్ పెరగలేదు, అయినప్పటికీ మనదగ్గర కరోనా వైరస్ భయం ఇంకా పోలేదు కాబట్టి మాస్క్ తప్పనిసరిగా ధరించండి, ఎవరైనా వ్యాక్సిన్ వేసుకోకపోతే..వారంతా తీసుకోవాలని పిలుపునిచ్చారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలోనే ఈ ఒక్క రోజే 2000 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే పాజిటివ్ కేసుల సంఖ్య 15 శాతం ఎక్కువ. ఈ నేపథ్యంలో గతంలో మాస్కుల వాడకం తప్పనిసరి కాదు అంటూ ఉత్తర్వులు తొలగించిన రాష్ట్రాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు మాస్కుల్ని తప్పనిసరి చేస్తూ రూల్స్ ప్రవేశపెట్టాయి. ఢిల్లీ, పంజాబ్ తర్వాత నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఉండే హర్యానా రాష్ట్రంలోని గురుగ్రాం, ఫరీదాబాద్, సోనేపట్, ఝజ్జర్ జిల్లాలో మాస్కులను తప్పనిసరి చేసింది హర్యానా ప్రభుత్వం. మరోవైపు మాస్కులు తప్పనిసరి కాదు అంటూ ఉత్తర్వులను తొలగించిన చండీగఢ్లో కూడా మంగళవారం నుంచి తప్పనిసరి చేస్తూ ఆర్డర్ జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ మాస్కులని తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలంటూ ఆజ్ఞ జారీ చేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్లో కూడా లక్నోతో పాటుగా నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఉండే ఆరు జిల్లాల్లో మాస్కులను తప్పనిసరి చేశారు.