శంషాబాద్‌ నుంచి బయల్దేరిన విమానంలో మంటలు.. 3 గంటల తర్వాత..

కొద్ది రోజులుగా వరుసగా విమానాలు ప్రమాదాల్లో పడుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  20 Jun 2024 4:51 AM GMT
malaysia airlines, flight, fire, Hyderabad airport,

శంషాబాద్‌ నుంచి బయల్దేరిన విమానంలో మంటలు.. 3 గంటల తర్వాత..

కొద్ది రోజులుగా వరుసగా విమానాలు ప్రమాదాల్లో పడుతున్నాయి. సాంకేతిక లోపాల కారణంగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. నిన్నటికి నిన్న ఢిల్లీలో విమానంలో ఏసీలు పని చేయక ఉక్కపోతతో తీవ్ర ఇబ్బంది పడ్డారు ప్రయాణికులు. ఇక తాజాగా హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి మలేషియా బయల్దేరిన విమానం పెను ప్రమాదం నుంచి బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మలేషియాలోని కౌలాలంపూర్‌కు మలేషియా ఎయిర్‌లైన్స్‌ విమానం బయల్దేరింది. బుధవారం అర్ధరాత్రి దాటాక సుమారు ఒంటి గంట సమయంలో టేకాఫ్‌ తీసుకుంది. అలా గాల్లోకి ఎగిరిన 15 నిమిషాలకే విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో.. విమానం కుడి వైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఇక దీన్ని వెంటనే గుర్తించిన పైలట్లు ఈ సమాచారాన్ని ఏటీసీ అధికారులకు చెప్పారు. విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సి ఉంటుందని అన్నారు. ఆ తర్వాత ఏటీసీ అధికారులు ప్రమాద తీవ్రతను గుర్తించి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.

విమానంలో ఇంధనం అధికంగా ఉండటం వల్ల ల్యాండింగ్‌ సమయంలో మంటలు చెలరేగుతాయని అధికారులు భావించారు. దాంతో.. సుమారు 3 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టించారు. చివరకు మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం 3.58 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అయితే.. విమానంలోని ప్రయాణికులంతా మంటలు చెలరేగడం.. గాల్లోనే చాలా సేపు చక్కర్లు కొట్టడంతో భయాందోళనకు గురయ్యారు. చివరకు విమానం సేఫ్‌గా ల్యాండ్‌ అవ్వడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా.. ఈ సంఘటన సమయంలో విమనంలో 138 మంది ప్రయాణికులు ఉన్నారు.

Next Story