లక్ష లౌడ్ స్పీకర్లను తొలగించాం - యూపీ సీయం యోగి

By -  Nellutla Kavitha |  Published on  23 May 2022 5:17 PM IST
లక్ష లౌడ్ స్పీకర్లను తొలగించాం - యూపీ సీయం యోగి

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షకుపైగా లౌడ్ స్పీకర్లను తొలగించినట్టుగా ప్రకటించారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. పరిమితులకు మించి శబ్ద కాలుష్యానికి కారణం అవుతున్నాయని భావించిన యోగి సర్కార్ ప్రార్థనాలయాలలో లౌడ్ స్పీకర్లను నియంత్రించాలని భావించింది. ఈ నేపథ్యంలోనే ప్రార్థనాలయాలు ఒకటికి మించి లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేయకూడదని ఆజ్ఞలు జారీ చేసింది. అది కూడా నిర్దేశించిన డెసిబెల్స్ లోనే శబ్దం ఉండాలని నిర్ణయించింది.

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా లక్షకుపైగా లౌడ్ స్పీకర్ తొలగించడంతో పాటుగా కొన్ని చోట్ల డెసిబుల్స్ ను కూడా నిరోధించగలిగామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అలా తొలగించిన లౌడ్ స్పీకర్ లు, మైక్రోఫోన్ లను పాఠశాలలు, ఆసుపత్రులకు డొనేట్ చేసినట్టుగా ప్రకటించారు. దీంతోపాటుగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రంజాన్ రోజు రోడ్లమీద నమాజు చేయకుండా నియంత్రణ చర్యలు చేపట్టామని ప్రకటించారు యోగి ఆదిత్యనాథ్. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక శాంతి భద్రతలు పెరిగాయని, ముఖ్యంగా మహిళలు సంతోషంగా ఉన్నారని ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో నడిచే ఆర్గనైజర్, పాంచజన్య 75వ ఫౌండేషన్ డే వేడుకల్లో ఆయన వివరించారు. వర్చువల్ గా జరిగిన పౌండేషన్ డే వేడుకల్లో యోగి ఆదిత్యనాథ్ పాల్గొని ప్రసంగించారు.

మరోవైపు ఇదే వేడుకల్లో పాల్గొని ప్రసంగించిన అసోం సీఎం హిమంత బిశ్వ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ దేశంలో ఉన్న ముస్లింలంతా ఒకప్పటి హిందువులేనని, ఎవరు జన్మతః ముస్లింలు కాదని అన్నారు. మదర్సాలకు వెళ్లే పిల్లలు ఎవరూ డాక్టర్లు, ఇంజనీర్లు కాలేరు, మదర్సాలో చిన్నారులను చేర్పించడం వారి హక్కుల ఉల్లంఘన అంటూ సంచలన వ్యాఖ్యలు ఇదే వేడుకలో చేశారు. అసలు మదర్సా అనే పదమే ఉండకూడదని, ఖురాన్ ను ఇళ్లలో మాత్రమే చదువుకోవాలని స్కూళ్లలో చదవకూడదని వ్యాఖ్యానించారు.

ఇక గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఈ వేడుకలో ప్రసంగించారు. ధ్వంసమైన పురాతన దేవాలయాలను పునర్నిర్మించి తీరాల్సిందేనని వ్యాఖ్యానించారు. గోవాలో పోర్చుగీసువారి హయాంలో ధ్వంసమైపోయిన దేవాలయాల పునరుద్ధరణ కోసం బడ్జెట్ కేటాయింపులు తమ ప్రభుత్వం చేసిందని చెప్పారు గోవా సీఎం. మరోవైపు గోవా ప్రభుత్వం కల్చరల్ టూరిజంను ప్రమోట్ చేయడానికి కావలసిన అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు.

Next Story