లిక్కర్ స్కాం కేసులో కవిత బెయిల్‌పై తీర్పు వాయిదా
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 2 May 2024 11:15 AM ISTలిక్కర్ స్కాం కేసులో కవిత బెయిల్‌పై తీర్పు వాయిదా
లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలను అరెస్ట్ చేశారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. అయితే.. కవిత తనకు బెయిల్ ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది. ఇవాళ్టికి తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు.. మే 6వ తేదీన సీబీఐ, ఈడీ రెండు కేసుల్లో బెయిల్ పిటిషన్లపై తీర్పును వెలువరించనున్నట్లు ప్రకటించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ మార్చి 15వ తేదీన అరెస్ట్ చేసింది. ఇక సీబీఐ ఏప్రిల్ 11న అరెస్ట్ చేసింది. దాంతో.. కవిత రెండు బెయిల్ పిటిషన్లను దాఖలు చేశారు. ప్రస్తుతం ఎ్మెల్సీ కవిత 14 రోజుల జ్యుడిషిల్ కస్టడీలో బాగంగా తీహార్ జైలులో ఉన్నారు. సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరఫున రౌస్ అవెన్యూ కోర్టులో ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. మహిళగా కవిత బెయిల్‌కు అర్హురాలని చెప్పారు. అరెస్ట్ నుంచి విచారణ వరకు ఎటువంటి మెటీరియల్ లేదన్నారు. ఆధారాలు లేకుండానే కవితను అరెస్ట్ చేశారని న్యాయవాది పేర్కొన్నారు. ఈడీ కస్టడీలో ఉండగా.. సీబీఐ ఎందుకు అరెస్ట్ చేసిందని కవిత తరఫు న్యాయవాది కోర్టులో ప్రస్తావించారు.
సీబీఐ తరఫున న్యాయవాది కూడా కోర్టుకు తమ వాదనలు వినిపించారు. కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈ సందర్భంగా కోరారు. లిక్కర్ స్కాం కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని సీబీఐ కోర్టుకు వివరించింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది. సీబీఐ, ఈడీ కేసుల్లో కలిపి ఈ నెల 6వ తేదీన తీర్పు వెల్లడిస్తామని రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా వెల్లడించారు.