సాగర్ కుడికాలువ నుంచి ఏపీ నీరు తీసుకోవడం ఆపాలి: కేఆర్‌ఎంబీ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ నాగార్జున సాగర్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగిన విషయం అందరికీ తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  1 Dec 2023 10:45 AM GMT
krmb letter,  ap govt,  nagarjuna sagar issue,

 సాగర్ కుడికాలువ నుంచి ఏపీ నీరు తీసుకోవడం ఆపాలి: కేఆర్‌ఎంబీ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ నాగార్జున సాగర్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగిన విషయం అందరికీ తెలిసిందే. ఏపీ ప్రభుత్వ అధికారులు అక్కడికి చేరుకుని పంతం నెగ్గించుకుని కుడి కాలువ నుంచి 2వేల క్యూసెక్కుల నీటిని వదిలేశారు. అధికారుల చర్యపై తీవ్ర దుమారం రేగింది. అయితే.. తాజాగా ఈ అంశంపై కేఆర్‌ఎంబీ స్పందించింది. ఏపీ జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబ్ నెల కోసం అడిగిన 5 టీఎంసీల నీటిలో ఇప్పటికే 5.01 టీఎంసీల నీరు విడుదల చేసినట్లు లేఖ రాసింది కేఆర్ఎంబీ. నవంబర్ 30వ తేదీ తర్వాత నీటి విడుదలపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి అందలేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో నాగార్జున సాగర్‌ కుడి కాలువ నుంచి నీరు తీసుకోవడం ఏపీ ఆపాలని ఏపీ ప్రభుత్వానికి కృష్ణ రివర్‌ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉండగా.. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ డ్యామ్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించి ఉన్నారు. మళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. పూర్తి సాగర్ డ్యామ్‌ పోలీసుల బందోబస్తు మధ్య ఉంది. ఏపీ వైపు భారీగా పోలీసులు మోహరించారు. ఏపీకి చెందిన సుమారు 1200 మంది పోలీసులు అక్కడ ఉన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణ రివర్ బోర్డుఅధికారులు సాగర్ వద్దకు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఆ తర్వాత ఏపీకి కేఆర్‌ఎంబీ ఈ ఆదేశాలను జారీ చేసింది.

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో 26 గేట్లకు 13 గేట్లు ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలో ఉంటాయి. కుడి కాలువ నుంచి ఏపీకి నీళ్లను కూడా తెలంగాణ అధికారులే విడుదల చేస్తున్నారు. గతంలో కృష్ణా బోర్డు ఆదేశాలు ఇచ్చినా నీళ్లు విడుదల చేయని సందర్భాలు ఉండేవి. గత రెండు నెలల్లో మాత్రం ఎలాంటి ఇబ్బందులు రాలేదు. కానీ.. ఎన్నికల సమయంలో ఒకేసారి ఏపీ పోలీసులు నాగార్జునసాగర్‌ వద్ద మోహరించడంపై ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఉమ్మడి జలాశయాలను బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని ఏపీ డిమాండ్ చేస్తోంది.

Next Story