కువైట్‌లో ఇంట్లో అగ్నిప్రమాదం, కేరళకు చెందిన ఫ్యామిలీ మృతి
కువైట్ నగరంలోని ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 20 July 2024 2:30 PM GMTకువైట్‌లో ఇంట్లో అగ్నిప్రమాదం, కేరళకు చెందిన ఫ్యామిలీ మృతి
కువైట్ నగరంలోని ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భారత్‌కు చెందిన నలుగురు సభ్యుల కుటుంబం ప్రాణాలను కోల్పోయింది. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ మేరకు వివరాలను ది అరబ్ టైమ్స్ వార్తాపత్రిక వెల్లడించింది.
శుక్రవారం అర్ధరాత్రి ఈ అగ్నిప్రమాదం సంభవించింది. కేరళలోని అలప్పుజాలోని నీరట్టుపురానికి చెందిన మాథ్యూస్ ములక్కల్, అతని భార్య లిని అబ్రహం, వారి ఇద్దరు పిల్లలు అగ్నిప్రమాదం కారణంగా ఊపిరాడక మరణించారు. భారత్‌కు చెందిన వీరు అదే రోజు కేరళ నుంచి కువైట్ వెళ్లారు. సెలవులు ముగిసిన తర్వాత వెళ్లిన రోజు అగ్నిప్రమాదం సంభవించడం.. ఊపిరి ఆడక నలుగురు చనిపోవడం విషాదంగా మారింది. ఎయిర్ కండీషనర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. రాత్రి 8 గంటల సమయంలో అబ్బాసియా ప్రాంతంలో ఉన్న వారి రెండవ అంతస్తు అపార్ట్‌మెంట్లో చేలరేగాయి. భారీ ఎత్తున పొగ అలుముకోవడంతో వారికి ఊపిరి ఆడలేదు. దాంతో అక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కాగా, ఈ ఘటనపై అరబ్ దేశంలో భారతీయుల మృతి పట్ల కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఎంబసీ బాధితుల కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉందని, మృత దేహాలను త్వరగా స్వదేశానికి రప్పించేలా చూస్తామని కూడా తెలిపింది.