మహేష్ చరిత్రలో నిలిచిపోతారు : సీఎం కేసీఆర్
KCR has expressed shock over the martyrdom Army Jawan Mahesh. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో నిజామాబాద్
By Medi Samrat Published on 10 Nov 2020 11:38 AM ISTజమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన జవాన్ మహేశ్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన యోధుడిగా మహేశ్ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. మహేశ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. జవాన్ కుటుంబానికి ప్రభుత్వ పరంగా రూ. 50లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. అర్హతను బట్టి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. మహేశ్ కుటుంబానికి ఇంటి స్థలం కూడా కేటాయిస్తామని వెల్లడించారు.
జమ్మూ కశ్మీర్‌లో నిన్న ఉగ్రవాదులకు, జవాన్లకు ఎదురు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు అమరులు కాగా, ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. అయితే కుప్వారా జిల్లా మచిల్ సెక్టార్ ప్రాంతంలో ముష్కరులపై జరిగిన పోరులో అసువులు బాసిన భారత జవాన్లు నలుగురిలో తెలంగాణకు చెందిన మహేష్ కూడా ఉన్నారు.
ఉగ్రమూకలపై తన పోరును కొనసాగించి వీరమరణం చెందిన ఆర్.మహేష్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా కోమన్‌పల్లి. గత సంవత్సరమే మహేష్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. 8 నెలల కిందట సైన్యంలో చేరిన మహేష్.. ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం చెందిన ఆ కుటుంబాన్ని విషాదంలో నెట్టేసింది. చిన్నతనం నుంచి చురుకుగా ఉండే మహేష్‌కు సైన్యంలో చేరాలన్న లక్ష్యంతో కుటుంబ సభ్యులను ఒప్పించి అందులో చేరాడు. మహేష్ మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించనున్నారు.