సూర్యుడే ఇస్రో టార్గెట్.. ఆదిత్య ఎల్‌1 ప్రయోగం

తొలిసారి సూర్యుడిపై పరిశోధనల కోసం అంతరిక్ష ప్రయోగం చేసేందుకు ఏర్పాట్లు చేసింది ఇస్రో.

By Srikanth Gundamalla  Published on  28 Aug 2023 4:46 PM IST
ISRO,  Sun, Aditya-L-1 Mission,

 సూర్యుడే ఇస్రో టార్గెట్.. ఆదిత్య ఎల్‌1 ప్రయోగం

ఇటీవల ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయ్యింది. దాంతో.. ప్రపంచ దేశాలన్నీ ఇండియా వైపు చూశాయి. అయితే.. చంద్రుడిపై కాలు పెట్టిన తర్వాత.. ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలు సూర్యుడిపై ప్రయోగాలకు సిద్ధం అవుతున్నారు. తొలిసారి సూర్యుడిపై పరిశోధనల కోసం అంతరిక్ష ప్రయోగం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం ద్వారా సూర్యుడిపై ప్రయోగాలు చేయనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. సెప్టెంబర్‌ 2వ తేదీన ఉదయం 11 గంటల 50 నిమిషాలకు శ్రీహరి కోట నుంచి రాకెట్‌ను లాంచ్‌ చేయనున్నారు.

పీఎస్‌ఎల్వీ సీ57 రాకెట్‌ను ఉపయోగించి.. సూర్యుడి సమీపానికి ఆదిత్య ఎల్‌-1ను ప్రయోగించనుంది ఇస్రో. ఈ రాకెట్‌, శాటిలైట్ ఇప్పటికే బెంగళూరు నుంచి శ్రీహరి కోటకు చేరుకున్నాయి. ఇస్రో ఫ్లాగ్ షిప్ మిషన్‌గా ఇది రూపుదిద్దుకుంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 1500 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. అంతేకాదు.. ఇస్రో సూర్యుడిపై అధ్యయనం చేసే కార్యక్రమం మొదలుపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రేంజ్‌ పాయింట్ వద్ద ఈ స్పేస్‌ క్రాఫ్ట్‌ను కక్ష్యలో ఉంచనుంది ఇస్రో.

పీఎస్‌ఎల్వీ సీ57 రాకెట్‌ ఆదిత్య ఎల్‌-1 స్పేస్‌ క్రాఫ్ట్‌ను ఎర్త్‌ ఆర్బిట్‌ వరకు తీసుకెళ్లి వదులుతుంది. ఆ తర్వాత ఆదిత్య ఎల్‌-1 భూమి చుట్టూ తిరిగి.. గ్రావిటేషనల్‌ ఫోర్స్‌ను వాడుకుంటూ.. సూర్యుడి చేరువలోకి వెళ్తుంది. సూర్యుడి వాతావరణంలో తిరుగుతూ.. వివిధ కిరణాలు, సౌర తుపానులు లాంటి అంశాలను గ్రహిస్తూ ఆ వివరాలను ఈ స్పేస్‌ క్రాఫ్ట్‌ ఇస్రోకు అందించనుంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ప్రయోగించే అంతరిక్ష నౌక మొత్తం ఏడు పే లోడ్స్ ను తీసుకెళ్తుంది. ఇవన్నీ దేశీయంగా అభివృద్ధి చేసినవే.

Next Story