కొత్త ఏడాది తొలిరోజే ఇస్రో ప్రయోగం.. కౌంట్‌డౌన్ షురూ

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధం అవుతోంది.

By Srikanth Gundamalla  Published on  31 Dec 2023 6:29 AM GMT
isro,  xposat,  10 other payloads, new year day,

 కొత్త ఏడాది తొలిరోజే ఇస్రో ప్రయోగం.. కౌంట్‌డౌన్ షురూ

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధం అవుతోంది. కొత్త ఏడాది తొలి రోజే పీఎస్‌ఎల్‌వీ -సీ58 ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు చేసింది. PSLV వాహననౌక ఇండియాకు చెందిన ఎక్స్‌-రే పొలారిమీటర్‌ ఉపగ్రహం (ఎక్స్‌పోశాట్‌)ను అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది.2023 సంవత్సరంలో చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్ 1 ప్రయోగాలతో మంచి ఊపు మీద ఉన్న ఇస్రో కొత్త ఏడాదిలోనే మరో ప్రయోగం చేస్తుంది. ఎక్స్‌పోశాట్‌తో పాటు మరో 10 పేలోడ్‌లను నింగిలోకి తీసుకెళ్లనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపడుతుంది.

శ్రీహరికోటలో కౌంట్‌డౌన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 8.10 గంటలకే ప్రారంభం అయ్యింది. ఈ ప్రక్రియ 25 గంటల పాటు కొనసాగి సోమవారం ఉదయం 9.10 గంటలకు పూర్తవుతుంది. ఆ తర్వాత పీఎస్‌ఎల్‌వీ-సి58 వాహననాక షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్తుంది. ఇది ఎక్స్‌పోశాట్‌ను కక్ష్యలోకి వదిలిన తర్వాత పీఎస్‌4.. 10 ఇతర పేలోడ్‌లను హోస్ట్‌ చేయనుంది. ఎక్స్‌పోశాట్‌ ఉపగ్రహం.. భారత్ అంతరిక్ష ఆధారిత ఎక్స్‌-రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇమేజింగ్‌, టైం-డొమైన్‌ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కొపీపై ప్రధానంగా దృష్టి సారించిన గత ప్రయోగాల్లాగా కాకుండా.. ఎక్స్‌-రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ, ఎక్స్‌-రే మూలాలను అన్వేషించడం ఎక్స్‌పోశాట్‌ లక్ష్యమని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.

కొత్త ఏడాది సందర్భంగా తొలిరోజే ఇస్రో ప్రయోగం ఉన్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు. పీఎస్‌ఎల్‌వీ-సి58, ఎక్స్‌పోశాట్‌ నమూనా చిత్రాలను శ్రీవారి పాదాల చెంత పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. కాగా.. అంతకుముందు టీటీడీ అధికారులు ఇస్రో శాస్త్రవేత్తలకు ఘనస్వాగతం పలికారు.


Next Story