అంతరాయం తర్వాత ఇస్రో గగన్‌యాన్‌ టీవీ-డీ1 పరీక్ష విజయవంతం

ఇస్రో గగన్‌యాన్‌ టీవీ-డీ1 పరీక్ష విజయవంతం అయ్యింది.

By Srikanth Gundamalla  Published on  21 Oct 2023 10:57 AM IST
isro, gaganyan, tv-d1 test, sucessfull ,

అంతరాయం తర్వాత ఇస్రో గగన్‌యాన్‌ టీవీ-డీ1 పరీక్ష విజయవంతం

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్‌ తొలి అడుగు సక్సెస్‌ అయ్యింది. రోదసిలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. సాంకేతికలోపం కారణంగా కొంత ఆలస్యం అయ్యినా చివరకు పరీక్షను విజయవంతం చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. తలపెట్టిన కీలక ‘టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌ (టీవీ-డీ1)’ వాహకనౌక పరీక్షను ఇస్రో శనివారం విజయవంతంగా పరీక్షించింది. శ్రీహరికోట నుంచి ఉదయం 10 గంటలకు సింగిల్‌ స్టేజ్‌ లిక్విడ్‌ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత రాకెట్‌ నుంచి విడిపోయిన క్రూ మాడ్యూల్‌.. సురక్షితంగా పారాచూట్ల సాయంతో సముద్రంలోకి దిగింది.

రాకెట్‌ నింగిలోకి బయల్దేరాక ఇస్రో శాస్త్రవేత్తలు అబార్ట్‌ సంకేతాన్ని పంపారు. దాంతో రాకెట్‌ పైభాగంలోని క్రూ ఎస్కేప్‌ వ్యవస్థకు సంబంధించిన ఘన ఇందన మోటార్లు ప్రజ్వరిల్లాయి. దాదాపు 12 కిలోమీటర్ల ఎత్తులో.. క్రూ ఎస్కేప్‌ వ్యవస్థను రాకెట్‌ నుంచి వేరు చేశాయి. 17 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్‌ మాడ్యూల్‌, క్రూ మాడ్యూల్‌ పరస్పరం విడిపోయాయి. ఆ తర్వాత డ్రోగ్‌ పారాచూట్లు విచ్చుకున్నాయి. సెకనుకు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్‌.. సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది.

ఈ ప్రయోగం జరగడానికి ముందు కాస్త సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో.. పరీక్ష ఆలస్యం అయ్యింది. ముందుగా 8 గంటలకు అనుకున్నారు శాస్త్రవేత్తలు. అయితే.. 8.30కు పరీక్ష చేపడతామని ప్రకటించారు. కానీ.. 8.30 అయ్యాక పరీక్షకు 5 సెకన్ల ముందు సాంకేతిక లోపం ఎదురైంది. దాంతో ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు హోల్డ్‌లో పెట్టారు. వెంటనే రంగంలోకి దిగి సాంకేతిక లోపంపై పరిశీలన చేశారు. చివరకు మరో గంటలోనే సాంకేతిక లోపాన్ని గుర్తించి అంతా సరిచేశారు. దాంతో.. ఉదయం 10 గంటలకు రెండోసారి ప్రయత్నించగా.. ఈ సన్నాహక పరీక్షను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు.

గగన్‌యాన్‌లో భాగంగా టీవీ-డీ1 పరీక్షను విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ సోమనాథ్ అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. టీవీ-డీ1 మిషన్‌ను విజయవంతంగా పరీక్షించామని చెప్పారు. వ్యోమగాముల భద్రతకు సంబంధించిన వ్యవస్థ సమర్థతను దీని ద్వారా విశ్లేషించగలిగామన్నారు. తొలుత సాంకేతిక లోపం రాగానే గుర్తించామని.. దాన్ని సరిచేసి మళ్లీ ప్రయోగించామన్నారు. క్రూ మాడ్యుల్ సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది అని సోమనాథ్‌ వెల్లడించారు.

Next Story