చివరి క్షణంలో ఆగిపోయిన ఇస్రో గగన్‌యాన్‌ ప్రయోగం

ఇస్రో చేపట్టిన గగన్‌యాన్‌ ప్రయోగం చివరి క్షణంలో ఆగిపోయింది.

By Srikanth Gundamalla  Published on  21 Oct 2023 9:25 AM IST
isro, gaganyaan test, on-hold,  technical error,

చివరి క్షణంలో ఆగిపోయిన ఇస్రో గగన్‌యాన్‌ ప్రయోగం 

ఇస్రో శాస్త్రవేత్తలు గగన్‌యాన్‌ ప్రయోగాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ప్రయోగం చివరి క్షణంలో ఆగిపోయింది. గగన్‌యాన్‌ మిషన్‌ టీవీ డీ1లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దాంతో.. ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని చివరి క్షణంలో హోల్డ్‌లో పెట్టారు. ఆ సాంకేతిక సమస్య ఏంటనే దానిపై శాస్త్రవేత్తలు పరిశీలన మొదలుపెట్టారు. త్వరలోనే కొత్త ప్రయోగ తేదీని ప్రకటిస్తామని ఇస్రో చైర్మన్ సోమనాథ్‌ ప్రకటించారు.

గగన్‌యాన్‌ ప్రయోగంలో జస్ట్‌ నాలుగు సెకండ్ల ముందు సాంకేతిక లోపాన్ని గుర్తించారు ఇస్రో శాస్త్రవేత్తలు. దాంతో ప్రయోగాన్ని హోల్డ్‌లో పెట్టినట్లు చెప్పారు. ఇక అంతకుముందే గగన్‌యాన్‌ ప్రయోగంలో స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయి. కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 8.00 గంటలకు ఈ పరీక్ష జరగాల్సి ఉండగా.. మొదట గగన్‌యాన్‌ ప్రయోగాన్ని అరగంట ఆలస్యంగా ప్రయోగిస్తున్నట్లు చెప్పింది. దాంతో.. శనివారం ఉదయం 8.30 గంటలకు నిర్వహించాల్సి ఉండగా.. చివరి క్షణంలో సాంకేతిక లోపంతో ఆగిపోయింది.

రోదసిలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు గగన్‌యాన్‌ ప్రాజెక్టు చేపట్టింది ఇస్రో. ‘టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌’ (టీవీ-డీ1) అనే పరీక్ష ద్వారా వ్యోమగాముల భద్రతకు సంబంధించిన వ్యవస్థ సమర్థతను విశ్లేషించాల్సి ఉంది. గగన్ యాన్ కు ముందు ఇస్రో నిర్వహించనున్న నాలుగు పరీక్ష్లల్లో టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ మొదటిది.ఇంతకుముందు 2018లో ఇలాంటి పరీక్ష నిర్వహించినప్పటికీ.. అది పరిమిత స్థాయిలోనే జరిగింది. ఈసారి దాదాపుగా పూర్తిస్థాయిలో సిద్ధమైన వ్యోమనౌకను పరీక్షించనున్నారు. దీని ఫలితాల ఆధారంగా ఇస్రో తదుపరి పరీక్షలకు సిద్ధమవుతుంది.

ప్రయోగంపై త్వరలోనే ప్రకటిస్తామని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ చెప్పారు. ప్రయోగంలో సాంకేతిక సమస్య ఏర్పడిందని.. సమస్య ఎక్కడ వచ్చిందో గుర్తిస్తామన్నారు. అన్ని సరిచూసుకొని మరోసారి గగన్‌యాన్‌ పరీక్ష చేపడతామన్నారు ఇస్రో చైర్మన్.

Next Story