సెంటిమెంట్లు ఢిల్లీ వైపే.. ముంబై కప్ ను ముద్దాడేనా..!

IPL-2020 Final Match. కొన్ని కొన్ని సార్లు ఏదైనా టోర్నమెంట్లలో సెంటిమెంట్లు చాలా కీలకంగా ఉంటాయి.

By Medi Samrat  Published on  10 Nov 2020 10:41 AM GMT
సెంటిమెంట్లు ఢిల్లీ వైపే.. ముంబై కప్ ను ముద్దాడేనా..!

కొన్ని కొన్ని సార్లు ఏదైనా టోర్నమెంట్లలో సెంటిమెంట్లు చాలా కీలకంగా ఉంటాయి. ఐపీఎల్-2020 ఫైనల్స్ ముందు కూడా ఇలాంటి సెంటిమెంట్లే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఐపీఎల్ 2020 ఫైనల్ లో ముంబై ఇండియన్స్ తో ఢిల్లీ కేపిటల్స్ జట్టు తలపడనుంది. ముంబై ఇండియన్స్ ను కొన్ని సెంటిమెంట్స్ టెన్షన్ పెడుతున్నాయి.

ప్రతీ లీప్ సంవత్సరంలో ఐపీఎల్‌లో కొత్త ఛాంపియన్ అవతరించింది. ప్రారంభ సీజన్ 2008లో రాజస్థాన్ రాయల్స్ టైటిల్ అందుకోగా.. 2012లో కోల్‌కతా నైట్ రైడర్స్.. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నయా చాంపియన్లుగా నిలిచాయి. ఈ లెక్కన 2020లో ఢిల్లీ తొలి టైటిల్ అందుకోవాల్సి ఉంటుందని చెబుతూ ఉన్నారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును వదిలిపెట్టి వచ్చిన వాళ్లు ఐపీఎల్ టైటిల్ ను ముద్దాడారనే సెంటిమెంట్ కూడా జనాల్లో బాగా పాతుకుపోయింది. 2017లో షేన్ వాట్సన్‌ బెంగళూరు నుండి వచ్చేయగా.. 2018లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2018లో క్వింటన్ డికాక్‌ను బెంగళూరు వదులుకోగా.. 2019లో ముంబై తరఫున బరిలోకి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు.

2019లో బెంగళూరు మార్కస్ స్టోయినిస్, హెట్‌మైర్‌లను రిలీజ్ చేయగా.. ఆ ఇద్దరు ఈ సీజన్‌లో ఢిల్లీకి ఆడుతూ ఫైనల్‌కు చేర్చారు. గత రెండు సీజన్లు మాదిరే ఈ సారి కూడా ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే మాత్రం ఫైనల్ లో ఢిల్లీ విజయం పక్కా అని చెబుతున్నారు. ఇంకొద్ది గంటల్లో ఈ సెంటిమెంట్లు ఏవి వర్కౌట్ అయ్యాయి.. అవ్వలేదు అన్నది తెలిసిపోనుంది.


Next Story