శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు.. వైభవంగా రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు
In Two Telugu states Maha Shivaratri Festival Celebrations.తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా
By తోట వంశీ కుమార్
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివాలయాలు శివనామస్మరణలతో మార్మోగుతున్నాయి. వేకువ జామునే భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటున్నారు. భోలాశంకరుడికి రుద్రభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. సాయంత్రం 4 గంటలకు శివదీక్ష స్వాములకు దర్శనం కల్పించనున్నారు. 6.05గంటలకు స్వామి వారి కల్యాణమండపంలో మహాలింగార్చన నిర్వహించనున్నారు. రాత్రి 11.35 గంటలకు లింగోద్భవ సమయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించనున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పానగల్ ఛాయాసోమేశ్వరాలయం, చెర్వుగట్టు, వాడపల్లి, పిల్లలమర్రి, శివాలయాలకు భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనం కోసం వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. హనుమకొండ వేయి స్తంభాల గుడిలో మహాశివరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. జనగామ జిల్లా పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కీసరలోనూ మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. క్యూలైన్లు అన్నీ నిండిపోయాయి. ఉచిత దర్శనానికి ఆరు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోనూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనానికి భక్తులు బారులుదీరారు. మహాశివరాత్రి కావడంతో ఇక్కడ రాహు, కేతు, సర్ప దోష నివారణ పూజలు రద్దు చేశారు. కోటప్పకొండలో మహాశివరాత్రి తిరునాళ్ల మహోత్సం వైభవోపేతంగా జరుగుతోంది. కృష్ణా జిల్లా పెద్దకల్లెపల్లిలో దుర్గా నాగేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అనంతపురంలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా పూజలు నిర్వహించారు.