గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో WWE ఫైట్.. ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్మెంట్ పోరు జరగనుంది.
By Srikanth Gundamalla Published on 8 Sep 2023 8:13 AM GMTగచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో WWE ఫైట్.. ట్రాఫిక్ ఆంక్షలు
ఇన్నాళ్లూ విదేశాల్లో జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్‌ని ఇండియన్ ప్రేక్షకులు చాలా ఇంట్రెస్టింగ్‌గా చూసేవారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ WWEకి ఫ్యాన్స్ ఉన్నారు. అయితే.. ఇన్నాళ్లు ఈ ఫైట్‌ను టీవీల్లో చూసిన హైదరాబాద్ అభిమానులకు ప్రత్యక్షంగా వీక్షించే అరుదైన అవకాశం ఇప్పుడు లభించింది. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్మెంట్ పోరు జరగనుంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్పెక్టాకిల్ రాత్రి 7.30 గంటలకు జరగనుంది.
2017లో భారతదేశంలో చివరిసారిగా డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్ జరిగింది. ఆరేళ్ల తర్వాత మళ్లీ సెప్టెంబర్ 8న మన హైదరాబాద్ నగరంలో డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. భారత రెజ్లర్లతో పాటు వేర్వేరు దేశాలకు చెందిన ప్రముఖ రెజ్లర్లు 28 మంది బరిలో నిలిచారు. ఈ పోరులో 16 సార్లు ప్రపంచ ఛాంపియన్ రెజ్లింగ్ ఆల్ టైం గ్రేట్ జాన్ సినా, ఇక్కడ బరిలోకి దిగుతున్నాడు. దాంతో.. ఈ ఈవెంట్ కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతో.. పోలీసులు గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు నిర్వహించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో జరిగే WWE సూపర్‌స్టార్ స్పెక్టకిల్ ఈవెంట్ కారణంగా గచ్చిబౌలి ప్రాంతంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11 వరకు గచ్చిబౌలి నుంచి హెచ్‌సీయూ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. గచ్చిబౌలి జంక్షన్ నుంచి హెచ్‌సీయూ వైపు ప్రయాణించే వాహనదారులు, కొండాపూర్ మార్గం నుంచి వెళ్లాలని సూచించారు. మరోవైపు నల్లగండ్ల నుంచి గచ్చిబౌలి జంక్షన్ వచ్చే వాహనదారులు మసీద్ బండ- కొండాపూర్- బొటానికల్ గార్డెన్ మీద నుంచి వాహనదారులు వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.