Hyderabad: ప్రధాని మోదీ రాక.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
దేశంలో పార్లమెంట్ ఎన్నికల హోరు కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 7 May 2024 5:28 AM GMTHyderabad: ప్రధాని మోదీ రాక.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
దేశంలో పార్లమెంట్ ఎన్నికల హోరు కొనసాగుతోంది. పలు దఫాలుగా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే.. మంగళవారం కూడా మూడో దశ పోలింగ్‌లో భాగంగా 93 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. మరోవైపు ఇతర ప్రాంతాల్లో ఎన్నికలకు రాజకీయ పార్టీలన్నీ రెడీ అయ్యాయి. జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటారు. ప్రధాని మోదీ రాకతో నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నగరంలో పర్యటిస్తున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి రాజ్‌భవన్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాత్రి 8.35 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్తారు.
ప్రధాని నరేంద్ర మోదీ రాక సందర్భంగా రాత్రి 8.30 గంటల నుంచి రాత్రి 9.10 గంటల వరకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి పీఎన్‌టీ ఫ్లైఓవర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, మోనప్ప ఐలాండ్, రాజ్‌భవన్ వరకు వాహన రాకపోకలను అనుమతించమని పోలీసులు తెలిపారు. అలాగే బుధవారం అంటే మే 8వ తేదీన ఉదయం 8.35 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారు. ఆ సందర్భంలో కూడా ఐలాండ్, నుంచి బేగంపేట వరకు సాధారణ వాహనాలకు అనుమతి ఉండదని ఈ మేరకు సీపీ కొత్తకోట శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు. ఈ సమయంలో ఆయా రూట్లలో ప్రయాణం చేసేవారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలనీ.. ట్రాఫిక్ ఆంక్షలను గమనించి ఇబ్బందులు పడకుండా ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ఆయన సూచించారు.