ముఖ్యగమనిక.. హైదరాబాద్‌లో దీపావళి పండుగపై పోలీసుల ఆంక్షలు

హైదరాబాద్ జంట నగరాల్లో ప్రజల శాంతి భద్రతతో పాటు.. ప్రశాంతత కల్పించేందుకు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కొన్ని సూచనలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  11 Nov 2023 7:15 AM IST
Hyderabad, police, issue orders,  diwali celebrations,

 ముఖ్యగమనిక.. హైదరాబాద్‌లో దీపావళి పండుగపై పోలీసుల ఆంక్షలు

దీపావళి అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో దీపాల కాంతులు, స్వీట్లు, కొత్త బట్టలతో ఆనందంగా గడుపుతుంటారు. కొందరు రకరకాల బాణసంచాలను కాలుస్తారు. అయితే.. మారుతున్న కాలానికి అనుగుణంగా కాలుష్యం పెరుగుతూనే ఉంది. ఈ దీపావళి ఒక్క రోజు అయితే అది మరింత రెట్టింపు అవుతోంది. కొందరు పెద్ద పెద్ద శబ్దాలతో వచ్చే బాణసంచా కాలుస్తుంటే.. ఇంకొందరు పొగ ఎక్కువగా వచ్చేవి వాడుతుంటారు. ఇలా చేయడం ద్వారా శబ్ధ కాలుష్యం.. వాయుకాలుష్యం జరుగుతున్నాయి. గ్రామాల్లో ఏమో కానీ.. నగరాల్లో మాత్రం ఈ కాలుష్య ప్రభావం ఎక్కువవుతోంది. సాయంత్రం మొదలుకుని.. అర్ధరాత్రి వరకు పటాకుల మోత మోగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ జంట నగరాల్లో ప్రజల శాంతి భద్రతతో పాటు.. ప్రశాంతత కల్పించేందుకు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కొన్ని సూచనలు చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్య ప్రెస్‌ నోట్ జారీ చేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టంలోని సెక్షన్ 67(సి) కింద తన విధులను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీపావళి పండుగ – 2023 వేడుకల సందర్భంగా బహిరంగ రహదారులతో పాటూ బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చడం నిషేధించబడిందని పేర్కొన్నారు. నగర ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేసేందుకు ఈ ప్రెస్‌నోట్‌ విడుదల చేస్తున్నామని చెప్పారు.

సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా నిబంధనలు ఉన్నాయని చెప్పారు సీపీ సందీప్‌ శాండిల్య. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని బహిరంగ రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో పెద్ద శబ్దాలతో కూడిన పటాకులు పేల్చడం పూర్తిగా నిషేధించబడింది అని వెల్లడించారు. దీపావళి సందర్భంగా రాత్రి 8 గంల నుంచి రాత్రి 10 గంటల మధ్య క్రాకర్స్‌, డ్రమ్స్, వాయిద్యాలకు అనుమతులు ఉందని చెప్పారు. కాలుష్య నియత్రంణ మండలి వెల్లడించిన ధ్వని తీవ్రతకు మించి పెద్ద పెద్ద శబ్దాలు చేయొద్దని సీపీ సందీప్ శాండిల్య నోట్‌లో పేర్కొన్నారు. అయితే.. ఈ ఆంక్షలు నవంబర్ 12వ తేది ఉదయం 06:00 గంటల నుండి నవంబర్ 15వ తేది ఉదయం 06:00 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే పోలీస్‌ యాక్ట్‌ ప్రకారం ప్రాసిక్యూషన్‌కు బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రజలకు సీపీ సందీప్‌ శాండిల్య తెలిపారు. పోలీసులకు సహకరిస్తూ.. ప్రజలు ఆనందంగా వాతావరణానికి హాని చేయకుండా దీపావళి జరుపుకోవాలని కోరారు.

Next Story