Hyderabad: రణరంగంలా కుస్తీ పోటీలు, ప్రేక్షకులకూ గాయాలు
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన 'మోదీ కేసరి కుస్తీ' పోటీలు రణరంగంలా మారాయి.
By Srikanth Gundamalla Published on 7 Oct 2023 9:52 AM ISTHyderabad: రణరంగంలా కుస్తీ పోటీలు, ప్రేక్షకులకూ గాయాలు
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన 'మోదీ కేసరి కుస్తీ' పోటీలు రణరంగంలా మారాయి. ఇరు వర్గాల వారు దాడులకు పాల్పడ్డారు. ఇద్దరి పహిల్వాన్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. చిన్న వివాదం కాస్త పెద్దది కావడంతో ఇరు వర్గాల వారు గొడవపడి తీవ్రంగా కొట్టుకున్నారు. స్టేజ్‌ను వదిలేసి ప్రేక్షకుల మధ్యకు వచ్చారు. చేతికి అందిన కుర్చీలతో దాడులకు తెగబడ్డారు.
ప్రేక్షకుల మధ్యకు వచ్చి పహిల్వాన్‌లు గొడవపడటం.. కుర్చీలు విరిగిపోయేలా కొట్టుకోవడంతో అంతా గందరగోళంగా మారింది. ఇరు వర్గాల వారు ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకోవడంతో అవి ప్రేక్షకులకు కూడా తగిలాయి. గొడవ ముదిరి పెద్దది కావడంతో ఫైట్ చూసేందుకు వెళ్లిన ప్రేక్షకులు భయపడిపోయారు. విరిగిన కుర్చీలు తగిలి.. ఘర్షణల మధ్య పలువురు ప్రేక్షకులకు కూడా గాయపడ్డారు. దాంతో.. భాయాందోళన మధ్య ప్రేక్షకులు స్టేడియం నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే.. ఈ సంఘన గురించి సమాచారం తెలుసుకున్న సైబరాబాద్ పోలీసులు వెంటనే స్టేడియం లోనికి వెళ్లారు. ఇరు వర్గాల వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కానీ.. అప్పటికే చాలా వరకు ఫర్నీచర్స్, చైర్లు ధ్వంసం అయ్యాయి.
అయితే.. ఈ గొడవలో 10 మందికి గాయాలు అయినట్లు సమాచారం. గాయపడ్డ వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. కాగా.. ఈ సంఘటనలో గొడవపడ్డ ఇరువర్గాల వారు పోలీసుల వద్దకు వెళ్లి ఒకరిపై మరొకరు కంప్లైట్ చేసుకున్నారు. ఇరువురి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కొందరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.