Hyderabad: కారులో రూ.2 కోట్లు పట్టుకున్న గాంధీనగర్ పోలీసులు
గాంధీ నగర్ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు అక్రమంగా తరలిస్తున్న రూ.2.09 కోట్ల నగదుని పట్టుకున్నారు.
By Srikanth Gundamalla Published on 16 Oct 2023 3:47 PM ISTHyderabad: కారులో రూ.2 కోట్లు పట్టుకున్న గాంధీనగర్ పోలీసులు
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్రమంగా తరలిస్తూ చాలా మంది డబ్బుతో పట్టుబడుతున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే కోట్ల నగదు పట్టుబడింది. మరోసారి కారులో తరలిస్తోన్న రూ.2.09 కోట్ల డబ్బును పోలీసులు సీజ్ చేశారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు తనిఖీలు చేస్తోన్న విషయం తెలిసిందే. అలాగే హైదరాబాద్‌లో కూడా చాలా చోట్ల పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకుంటున్నారు. నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాంధీనగర్ పోలీసులతో కలిసి భారీ నగదు సీజ్ చేశారు. ఒక లక్ష కాదు. రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.2.09 కోట్ల నగదు సీజ్ చేశారు. హవాలా మనీగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కవాడిగూడ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఒక కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులపై అనుమానం వచ్చింది. దాంతో.. ఆ కారుని ఆపి పోలీసులు సెర్చ్ చేశారు.
మొత్తం రూ.2.09 కోట్లు రూపాయలు గుర్తించారు. డబ్బుకి సంబంధించిన పత్రాలు నిందితుల వద్ద లేవు. దాంతో.. డబ్బులు తరలిస్తోన్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు దినేష్ కుమార్ పటేల్, సచిన్ కుమార్ విష్ణు భాయ్ పటేల్, జితేందర్ పటేల్, శివరాజ్ నవీన్ బాయి మోడీ, రాకేష్ పటేల్, ఠాకోర్ నాగ్జీ చతుర్థీగా గుర్తించారు. నిందితుల నుంచి TS09FQ8507 నెంబర్ ప్లేటుతో ఉన్న కారు (కియా సెల్టోస్ నలుపు రంగు), ఒక సుజుకి యాక్సెస్ స్కూటర్ (నెంబర్ ప్లేట్ TS-09 FG 3942)ను గాంధీనగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక అంతకుముందు వనస్థలిపురంలో రూ.29.40 లక్షల నగదుని ఎస్‌వోటీ పోలీసులు పట్టుఉకన్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు.