రేపు హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్.. అమల్లో 144 సెక్షన్
లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో హైదరాబాద్‌లో మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు సూచించారు.
By Srikanth Gundamalla Published on 3 Jun 2024 5:15 PM IST
రేపు హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్.. అమల్లో 144 సెక్షన్
దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రోజు. జూన్ 4వ తేదీ. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ అదేరోజు జరగనుంది. మరికొద్ది గంటల్లోనే కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. దాంతో.. రాజకీయ పార్టీల నాయకులే కాదు.. దేశ ప్రజలంతా ఆసక్తి కనబరుస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ చెప్పింది నిజం అవుతందా? లేదా అందుకు భిన్నంగా ప్రజా తీర్పు ఉండబోతుందా? అన్నది తేలనుంది. కాగా.. కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆంక్షలు విధిస్తున్నారు పోలీసులు.
లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో హైదరాబాద్‌లో మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు సూచించారు. అదేవిధంగా నగరంలో ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనల జరగకుండా చూసుకునేందుకు జూన్ 4వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్‌ను అమల్లోకి తీసుకున్నారు. ఈ మేరకు నగర ప్రజలంతా సహకరించాలని చెప్పారు. నగరంలో ఎక్కడైనా సరే ఐదుగురికి మించి గుమికూడకుదని పోలీసులు సూచిస్తున్నారు. భాగ్యనగరంలోని అన్ని వైన్ షాపులను కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. ఎవరైనా అక్రమంగా మద్యం నిల్వ చేసినా.. అమ్మినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణలో మే 13వ తేదీన లోక్‌సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. 17 లోక్‌సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ ఉపఎన్నిక ఫలితం కూడా జూన్ 4వ తేదీన వెల్లడించనున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ఓట్ల లెక్కింపు కోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల నియోజకవర్గాల పరిధిలో మొత్తం 19 కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసు భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎన్నికల సంఘం జారీ చేసిన పాస్‌లు ఉన్న సిబ్బంది, ఆయా పార్టీల అభ్యర్థుల ఏజెంట్లు, మీడియా ప్రతినిధులకు మాత్రమే అనుమతి ఉంటుంది.