భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ బాలకృష్ణ అక్రమంగా కోట్లు కూడబెట్టారా?

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు కోర్టు 14రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Jan 2024 9:00 PM IST
HMDA ex director, acb rides case, judicial remand,

భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ బాలకృష్ణ అక్రమంగా కోట్లు కూడబెట్టారా?

ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కోట్లాది ఆస్తులు కూడబెట్టిన ఓ ఉన్నతాధికారిపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. తెలంగాణలోని హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ప్లానింగ్ అధికారి శివ బాలకృష్ణ (54)పై ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై కేసు నమోదైంది. ఆయనకు చెందిన నివాసంతో పాటు మరో 15 ప్రాంతాలలో వరుసగా రెండు రోజుల పాటు ఏసీబీ దాడులు నిర్వహించి రూ. 8.26 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు కనుగొంది. అయితే ఇవి పేపర్ మీద కనుగొనబడిన ఆస్తుల చిట్టా మాత్రమే! వీటి విలువ బహిరంగ మార్కెట్ లో చాలా ఎక్కువగా ఉంటుందట.

ఇక ఇదే కేసులో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ కోర్టులో అధికారులు హాజరు పర్చారు. ఆయనకు కోర్టు 14రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఫిబ్రవరి 8వరకు రిమాండ్ ఉండనుంది. పోలీసులు ఆయన్ను చంచల్ గూడా జైలుకు తరలించారు.

99 లక్షల నగదు, బంగారం, వెండి దొరికాయి

విల్లా నంబర్ 25, ఆదిత్య ఫోర్ట్ వ్యూ, సెక్రటేరియట్ కాలనీ, పుప్పాలగడ్డ, రాజేంద్ర నగర్, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులకు సంబంధించిన పలు ప్రదేశాలలో దాడులు జరిగాయి. తన సర్వీస్‌లో అవినీతికి పాల్పడడమే కాకుండా.. పలు పద్దతుల ద్వారా ఆస్తులను సంపాదించినట్లు దర్యాప్తులో తేలింది. సోదాల్లో అతని ఇంటితో పాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా రూ.99,60,850 నగదు.. 1,988 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు 6 కిలోల వెండి ఆభరణాలు లభించాయి.

సోదాల్లో దాదాపు రూ. 5,96,27,495 విలువైన చర, స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు కూడా లభ్యమయ్యాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం సోదాల్లో దొరికిన ఆస్తుల విలువ దాదాపు రూ. 8,26,48,999 (రూ. 8 కోట్లకు పైగా) ఉంటుంది. చరాస్తుల మార్కెట్ విలువ, అలాగే స్థిరాస్తులు డాక్యుమెంట్ విలువ కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటాయి.

బాలకృష్ణపై ఏసీబీ హెల్ప్‌లైన్‌కు పలు ఫిర్యాదులు:

ప్రస్తుతం తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఎస్ బాలకృష్ణ గతంలో హెచ్‌ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ)కి ప్లానింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఐదేళ్ల పదవీ కాలంలో గ్రేటర్ హైదరాబాద్ అధికార పరిధిలో కొత్త భవనాలు, లేఅవుట్ ఆమోదం తదితర విషయాల కోసం అనుమతులు మంజూరు చేసే అధికారం ఆయనదే.

ప్రస్తుతం ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నేతృత్వంలో ఏసీబీ అధికారులు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1960లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తుండగా, బాలకృష్ణపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినట్లు సంబంధిత వర్గాలు న్యూస్‌మీటర్‌కి తెలిపాయి. సబ్జెక్ట్, పొజిషన్‌, పేపర్‌వర్క్‌లో నైపుణ్యం ఉన్న వ్యక్తిగా పేరుగాంచిన బాలకృష్ణ ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఈ స్థాయికి కొద్దిమంది మాత్రమే చేరుకోగలరు. అలాంటి అధికారిలో చీకటి కోణం తాజాగా బయటపడింది.

భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే బాధ్యత బాలకృష్ణదే!!

ఒక్క ఎకరం ధర రూ. 100 కోట్లకు చేరుకోగల కోకాపేట్, మోకిలాతో సహా మొత్తం హెచ్‌ఎండీఏ ఏరియాకు బాలకృష్ణ ప్లానింగ్ హెడ్ గా వ్యవహరించారు. కోట్ల విలువైన ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. బాలకృష్ణ ప్లానింగ్ డైరెక్టర్‌గా ఉండగానే వ్యవసాయం నుంచి కమర్షియల్‌గా భూ వినియోగాన్ని మార్చుకునేందుకు అనుమతులు, అనుమతుల కోసం నగదు, ఖరీదైన బహుమతుల రూపంలో లంచాలు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. జనవరి 24, 25 తేదీల్లో అవినీతి నిరోధక అధికారులు చేసిన దాడిలో దొరికిన ఐఫోన్‌లు, వాచీలు ఈ వాదనను రుజువు చేస్తున్నాయి.

ప్రజలకు సూచన:

ఏ ప్రభుత్వోద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే టోల్-ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయండి. చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికి తెలంగాణ ACBకి సంబంధించిన టోల్-ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని అధికారులు ప్రజలను అభ్యర్థించారు.

Next Story