దేశంలో పలుచోట్ల వడగాల్పులు.. 54 మంది మృతి
దేశంలో ఇంకా ఎండలు దంచికొడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు ఈ ఏడాది నమోదు అయ్యాయి.
By Srikanth Gundamalla Published on 31 May 2024 11:15 AM GMTదేశంలో పలుచోట్ల వడగాల్పులు.. 54 మంది మృతి
దేశంలో ఇంకా ఎండలు దంచికొడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు ఈ ఏడాది నమోదు అయ్యాయి. ఇక జూన్ నెల వచ్చేస్తున్న ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. కొన్ని చోట్ల వడగాల్పులు వీస్తున్నాయి. ఎండవేడిమితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బ కారణంగా దేశంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ సహా మధ్య, తూర్పు, ఉత్తర భారతదేశంలో తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నాయి. దాంతో.. దేశంలో ఇప్పటికే 54 మంది వడగాల్పుల కారణంగా చనిపోయారు. ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్ సహా దేశ రాజధాని ఢిల్లీలో మరో రెండ్రోజుల పాటు హీట్‌వేవ్ ఉంటుందనీ.. దుమ్ము తుఫాను రావొచ్చని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
గురువారం ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 45.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సాధారణం కంటే 5.2 డిగ్రీలు ఎక్కువ అని అధికారులు చెప్పారు. దేశ రాజధానిలో 79 ఏళ్లలో 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఒకసారి నమోదు కాగా.. తాజాగా అధికంగా నమోదు అయిన ఎక్కువ ఉష్ణోగ్రత ఇదే అని చెప్పారు.
మరోవైపు ఎండ వేడిమి కారణంగా బీహార్‌లో వడగాల్పులు వీస్తున్నాయి. దాంతో.. బీహార్ రాష్ట్రంలోనే ఏకంగా 32 మంది వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. ఔరంగాబాద్‌లో 17 మంది, అర్రా ప్రాంతంలో ఆరుగురు, గయా, రోహతాస్‌లో ముగ్గురు చొప్పున ప్రాణాలు బక్సర్ ప్రాంతంలో ఇద్దరు. పాట్నాలో వడదెబ్బతో కొరు చనిపోయారు. ఒడిశాలోని రూర్కెలాలో 10 మంది చనిపోగా..జార్ఖండ్‌లోని పాలము, రాజస్థాన్‌లో ఐదుగురు చనిపోయారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని సుల్తాన్ పూర్‌లో ఒకరు వడదెబ్బ కారణంగా చనిపోయారని నివేదికలు చెబుతున్నాయి.
బీహార్‌లో దర్భంగాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి ఢిల్లీలో చనిపోయాడు. అతని శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే 10 డిగ్రీలు ఎక్కువ అయ్యింది. 108 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు చేరడంతో అవయవాలు విఫలమై చనిపోయాడు. మరోవైపు గురువారం, రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ సహా విదర్భలోని అనేక ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీల సెల్సియస్ ఉన్నాయని ఐఎండీ తెలిపింది. పశ్చిమ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కోస్తాంధ్ర, యానాం, గుజరాత్, తెలంగాణ, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42-45 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి.