HCA: మహిళా క్రికెటర్ల ఫిర్యాదుతో హెడ్‌ కోచ్‌పై సస్పెన్షన్ వేటు

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ మరోసారి వార్తల్లో నిలిచింది.

By Srikanth Gundamalla  Published on  16 Feb 2024 6:44 PM IST
hca, women cricket, head coach, jai simha, suspended,

HCA: మహిళా క్రికెటర్ల ఫిర్యాదుతో హెడ్‌ కోచ్‌పై సస్పెన్షన్ వేటు

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. అప్పుడప్పుడు వివాదాలకు కేంద్రంగా ఉండే హెచ్‌సీఏలో మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి ఏకంగా మహిళల జట్టు హెడ్‌ కోచ్‌ జైసింహపై ఫిర్యాదులు అందాయి. అసభ్యంగా ప్రవర్తించారంటూ హెచ్‌సీఏ అధ్యక్షుడికి మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే కోచ్‌ జైసింహను సస్పెండ్‌ చేస్తూ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌రావు ఆదేశాలు జారీ చేశారు. జైసింహా విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని చెప్పారు. అప్పటి వరకు క్రికెట్‌ కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సి ఉంటుందని చెప్పారు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌రావు.

అసలేం జరిగిందంటే..

గత నెలలో హైదరాబాద్‌ క్రికెట్‌ మహిళల జట్టు మ్యాచ్‌ కోసం విజయవాడకు వెళ్లింది. అక్కడ మ్యాచ్‌ ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే.. వారు హైదరాబాద్‌కు వచ్చేందుకు విమాన టికెట్లు బుక్‌ చేసుకున్నారు. కానీ.. బస్సులో హైదరాబాద్‌కు వచ్చారు. కోచ్‌ జైసింహా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారనీ.. అందుకే ఫ్లైట్ మిస్‌ అయినట్లు మహిళా క్రికెటర్లు ఆరోపించారు. అయితే.. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బస్సులో వస్తున్న క్రమంలో కోచ్‌ జైసింహా మద్యం సేవించినట్లు ఫిర్యాదు చేశారు. గత నెల 12వ తేదీన ఈ ఫిర్యాదును మెయిల్‌ ద్వారా పంపినట్లు తెలుస్తోంది. మహిళా క్రికెటర్ల ముందే బస్సులో మద్యం సేవించాడనీ.. అప్పుడు బస్సులోనే ఉన్న సెలక్షన్ కమిటీ మెంబర్‌ పూర్ణిమరావు కూడా ఆయనకే మద్దతు తెలిపారిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాగొద్దని వారించినా వినలేదనీ.. పైగా తిట్టినట్లు కంప్లైంట్ చేశారు.

ఇక బస్సులో జైసింహా మద్యం తాగుతున్నట్లు ఉన్న వీడియో తాజాగా బయటకు వచ్చింది. దాంతో.. హెచ్‌సీఏ అధ్యక్షుడు వెంటనే స్పందించారు. చర్యలు తీసుకున్నారు. తక్షణమే హెడ్‌ కోచ్‌ జైసింహను తప్పిస్తున్నట్లు తెలిపారు. తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. విచారణ పూర్తయిన తర్వాత నేరం రుజువు అయితే క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌రావు వెల్లడించారు.


Next Story