చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
తెలంగాణలోని చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 11 Jan 2025 7:20 AM ISTచేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
తెలంగాణలోని చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ప్రారంభించిన సందర్భంగా చేనేతా కార్మికుల సమగ్రాభివృద్ధికి తెలంగాణ చేనేత అభయహస్తం స్కీమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ప్రకటిస్తూ తెలంగాణ సర్కార్ జీవో జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అభయహస్తం పథకం అమలుకు నిధులు రిలీజ్ చేయనుంది.
నేతన్న పొదుపు..
ఈ మేరకు తెలంగాణ నేతన్న పొదుపు రూ. 15 కోట్లు, పవర్ లూమ్స్, బకాయిలకు రూ.15 కోట్లు, తెలంగాణ నేతన్న భద్రత( నేతన్న బీమా) రూ.5.25 కోట్లు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ నేతన్న భరోసా రూ.31 కోట్లు, వేతన ప్రోత్సాహాకాలు రూ.31 కోట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. ఇక నేతన్న పొదుపు పథకం జియో ట్యాగ్‌తో అనుసంధానమైన మగ్గాల చేనేత కార్మికుల, అనుబంధ కార్మికుల సంక్షేమానికి రూపొందించింది.ఇది కార్మికుల్లో పొదుపు అలవాటును ప్రోత్సహించడంతో పాటు వారికి సామాజిక భద్రత కల్పించనుంది. ఇక చేనేత కార్మికులు, అనుబంధ కార్మికులు వారి వేతనాల నుంచి దీని కోసం నెలవారీగా 8 శాతం కాంట్రిబ్యూట్ చేస్తారు. కాంట్రిబ్యూషన్ గరిష్ట పరిమితి రూ.1200. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండింతలు అధికంగా 16 శాతం అందిస్తుంది. దీంతో దాదాపు 38 వేల మంది నేత కార్మికులు లబ్ధి పొందనున్నారు. ఈ పథకం 15 వేల మంది మర మగ్గాల కార్మికులకూ వర్తిస్తుంది. రికరింగ్ డిపాజిట్ వ్యవధి మూడు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలకు తగ్గించింది.
తెలంగాణ నేత భద్రత పథకం రాష్ట్రంలోని జియో ట్యాగింగ్ అయిన మొత్తం చేనేత, మర మగ్గాల కార్మికులు, అనుబంధ కార్మికులకు వర్తిస్తుంది. తెలంగాణ నేతన్న భద్రతలో నమోదైన కార్మికుడు ఏ కారణం చేత మృతిచెందినా రూ.5 లక్షల మొత్తం అతని నామినీకి అందుతుంది. తెలంగాణ చేనేత కార్మికుల సహకార సంఘం ద్వారా బీమా కవరేజీ అందరికీ వర్తిస్తుంది. ఈ పథకంలో ఇప్పటి వరకు ఉన్న 65 ఏళ్ల గరిష్ట వయో పరిమితిని ఎత్తివేశారు. 59 ఏళ్లు దాటిన వారికి ఇది వర్తిస్తుంది. ఈ పథకం అమలుకు ఏడాదికి బడ్జెట్ అంచనా వ్యయం రూ.9 కోట్లు
జియో ట్యాగ్ అయిన మగ్గాల నుంచి నిర్దిష్ట ఉత్పత్తి ప్రమాణాల ఆధారంగా చేనేత కార్మికులకు ఏడాదికి గరిష్టంగా రూ.18 వేలు, అనుబంధ కార్మికులకు రూ.6 వేలు వేతన సహాయం అందించబడుతుంది. దీంతో కార్మికులకు వేతన మద్దతు లభించడంతో పాటు నాణ్యత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. చేనేత మార్క్ లేబుల్చేనేత, సిల్క్ మార్క్ మాదిరే ప్రత్యేకమైన లోగో ద్వారా తెలంగాణకు ప్రత్యేకమైన చేనేత మార్క్ లేబుల్ రూపొందించబడింది. కాగా కొన్ని లక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రీమియానికి అనుగుణంగా తెలంగాణ చేనేత ఉత్పత్తులను లేబుల్ బ్రాండింగ్ చేయడాన్ని టార్గెట్‌గా పెట్టుకుంది. చేనేత వస్త్రాల ఘన వారసత్వ, సంప్రదాయ ప్రతిష్టను పెంపొందించడం, చేనేత బ్రాండ్ ప్రచారంతో తెలంగాణ చేనేత ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు, సముచితమైన మార్కెట్‌ను క్రియేట చేయడం లాంటి వాటిని టార్గెట్‌గా పెట్టుకుంది. తెలంగాణ చేనేత కార్మికుల జీవనోపాధి, సంక్షేమం, అభివృద్ధికి మద్దతుగా నిలిచే లక్ష్యాన్ని పెట్టుకుంది.